డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

కడప: ప్రేమ పేరుతో తరచూ వెంటపడుతూ వేధిస్తున్న ప్రేమోన్మాది.. తనను పట్టించుకోవడం లేదని.. తన ప్రేమను నిరాకరిస్తోందనే ఆగ్రహంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం కడప జిల్లా బద్వేలు మండలంలోని చింతలచెరువు గ్రామంలో జరిగిందీ ఘాతుకం. సుబ్బమ్మ, శిరీష దంపతుల కుమార్తె శిరీష బద్వేలులోని వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు చరణ్ అనే యువకుడు తరచూ వెంటపడేవాడు. చూసీచూడనట్లు వ్యవహరించినా పట్టించుకోలేదు. కొద్ది రోజుల క్రితం ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు. అతడి మాటలను శిరీష పట్టించుకోలేదు. 
కరోనా లాక్ డౌన్ వల్ల గత ఏడాది నుంచి కాలేజీ సరిగా తెరవకపోవడంతో ఇంటివద్దే ఎక్కువగా ఉంటోంది. కాలేజీకి రాకపోవడం గమనించి చరణ్ కొన్నిసార్లు గ్రామానికి వచ్చి శిరీషను కలిసే ప్రయత్నం చేశాడు. ఇదే కోవలో ఇవాళ శుక్రవారం కూడా గ్రామానికి వచ్చి తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి శిరీష సమాధానం ఇవ్వకపోడంతో.. ఎందుకు ఒప్పుకోవంటూ గట్టిగా నిలదీశాడు. నన్ను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానంటూ బెదిరించి అన్నంత పనీ చేశాడు. ఊహించని ఘటనతో శిరీష గట్టిగా కేకలు వేసింది. స్థానికులు వెంటనే వచ్చారు. వీరి రాకను గమనించి నిందితుడు చరణ్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. గ్రామస్తులు వెంటపడి పట్టుకున్నారు. మరో వైపు  తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో శిరీషను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసింది. శిరీష గొంతుకోసిన చరణ్ ను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. శిరీషను చంపిన ప్రేమోన్మాది చరణ్ అట్లూరు మండలం చెన్నంరాజుపల్లి గ్రామస్తుడుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.