కళ్లెదుటే తిరుగుతున్నా కనిపిస్తలేరంటున్నరు!

కళ్లెదుటే తిరుగుతున్నా కనిపిస్తలేరంటున్నరు!
  •     నిందితులు పరారీలో ఉన్నట్లు రిమాండ్ కాపీ 
  •     యథేచ్ఛగా బయటే తిరుగుతున్న నిందితులు
  •     పట్టించుకోని పోలీసులు.. కొలిక్కిరాని కేసు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని గడ్డిపల్లి హనుమాన్ రైసుమిల్లుకు సంబంధించిన సీఎమ్మార్‌‌‌‌‌‌‌‌ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గత నెల 7న రెండు లారీల్లో 60 టన్నుల ధాన్యాన్ని ఏపీకి తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్ట్‌‌‌‌లో పరారీలో ఉన్నట్లు పేర్కొన్న వ్యక్తులు యథేచ్ఛగా బయట తిరుగుతుండడంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.  

మలుపు తిరుగుతున్న కేసు

మిల్లు నుంచి ధాన్యాన్ని ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్న సివిల్ సప్లై ఆఫీసర్లు లారీలతో పాటు నిందితులను పోలీసులకు అప్పగించారు.  మొదట హనుమాన్ శివ సాయి మిల్లు ఓనర్  సుందరి నాగేశ్వరరావు, అతని భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా రామారావు అనే వ్యక్తితో పాటు ఉపేందర్, సోమ చంద్ర శేఖర్, కందిబండ ప్రభాకర్, జగన్ పేర్లను బయట పెట్టారు. వీరితో పాటు మరో ఆరు రైస్ మిల్లర్ల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుకు చెప్పారు. కానీ, వారు గత నెల 13న సుందరి నాగేశ్వరరావు, రామారావును మాత్రమే రిమాండ్ చేసి.. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నట్లు కేసు డైరీలో పేర్కొన్నారు. 

కలెక్టర్‌‌‌‌ మీటింగ్‌‌కు హాజరు  

పరారీలో ఉన్న ఐదుగురిలో ఒకరైన మిల్లర్ జగన్ ఇటీవల  కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు ఆధ్వర్యంలో సీఎమ్మర్‌‌‌‌‌‌‌‌పై నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌కు హాజరయ్యారు.  మరోపక్క కుడకుడకు చెందిన సోమ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ను గత నెల 8న రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని వదిలి పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో మిల్లర్ భార్య అదే గ్రామంలో ఉంటున్నా పరారీలో ఉందంటూ పోలీసులు పేర్కొనడం గమనార్హం.  అంతేకాదు పట్టుబడ్డ వ్యక్తి చెప్పిన ఆరు  రైస్ మిల్లర్ల పేర్లను పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టడం లేదు.  

కొలిక్కిరాని కేసు

హనుమాన్ శివసాయి రైస్ మిల్లు నుంచి తరలిస్తున్న 60 టన్నుల సీఎమ్మార్‌‌‌‌ ధాన్యాన్ని పట్టుకున్న అధికారులు ఎంక్వైరీ రిపోర్ట్ మాత్రం బయటపెట్టడం లేదు. ఈ కేసులో హుజూర్ నగర్ సీఎస్‌‌‌‌డీటీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి అప్పటి అడిషనల్ కలెక్టర్ మోహన్ రావుకు రిపోర్ట్ అందించారు. కొన్ని రోజులకే ఆయన బదిలీపై వెళ్లగా.. కొత్తగా వచ్చిన అడిషనల్‌‌‌‌ కలెక్టర్ వెంకట్ రెడ్డి వద్దకు ఈ రిపోర్ట్ చేరింది. ఆయన కూడా  రిపోర్ట్‌‌పై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఎంక్వైరీ చేస్తున్నం

గడ్డిపల్లి హనుమాన్ శివ సాయి రైస్ మిల్లులో అక్రమాలపై ఎంక్వైరీ చేస్తున్నం. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేయగా  ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌‌‌కు తరలించినం.  మిగిలినా ఐదుగురు పరారీలో ఉన్నరు.     

 -  వెంకట్ రెడ్డి, ఎస్సై గరిడే పల్లి

రిపోర్ట్ ఇచ్చినం

గడ్డిపల్లి కేసుకు సంబందించిన ఎంక్వైరీ రిపోర్ట్ గత నెలలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు అందించాం.  ఆయన బదిలీ కాగా.. కొత్తగా వచ్చిన అడిషనల్‌‌‌‌ కలెక్టర్ కోర్టులోఉంది.

- రాజశేఖర్, సివిల్‌‌‌‌సప్లై డీటీ, హుజూర్ నగర్