పాక్ ప్రధానిగా షెహబాజ్

పాక్ ప్రధానిగా షెహబాజ్
  •      మరోసారి పగ్గాలు చేపట్టనున్న పీఎంఎల్–ఎన్ ప్రెసిడెంట్
  •     ప్రెసిడెంట్ గా పీపీపీ కోచైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ 
  •     సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పీఎంఎల్-ఎన్, పీపీపీ ఒప్పందం 

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. రోజుల తరబడి చర్చల తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మధ్య ఒప్పందం కుదిరింది. పవర్ షేరింగ్ ఫార్ములాతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరింది. వీటికి ముత్తహిదా క్వామీ మూవ్ మెంట్–పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ), ఇస్తేకామ్–ఇ–పాకిస్తాన్, పాకిస్తాన్ ముస్లిం లీగ్–క్వైడ్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఒప్పందంలో భాగంగా పీఎంఎల్–ఎన్ ప్రెసిడెంట్, మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పీపీపీ కోచైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పీఎంఎల్–ఎన్ ప్రెసిడెంట్ షెహబాజ్ షరీఫ్ సంయుక్తంగా ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి వాళ్లిద్దరూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

మాకు సరిపడా బలం ఉన్నది.. 

ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం తమకు ఉందని బిలావల్ భుట్టో తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న ఇండిపెండెంట్లు, సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్ (సీఐసీ) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని చెప్పారు. పీపీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. తమకు మెజార్టీ ఉందని చెప్పారు. మద్దతు ఇస్తున్నందుకు ఎంక్యూఎం-–పీ, ఇస్తేకామ్–--ఇ-–-పాకిస్తాన్, పాకిస్తాన్ ముస్లిం లీగ్-–-క్వైడ్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తాం” అని చెప్పారు.