మొదటి వీడియోతోనే ఓవర్‌‌నైట్ స్టార్‌‌.. యూట్యూబ్ ఛానల్తో ఈ రైతు లక్షల్లో సంపాదిస్తున్నాడు!

మొదటి వీడియోతోనే ఓవర్‌‌నైట్ స్టార్‌‌.. యూట్యూబ్ ఛానల్తో ఈ రైతు లక్షల్లో సంపాదిస్తున్నాడు!

అతనిది నాగాలాండ్‌‌లో ఒక కుగ్రామం. పొలాలు, కొండల మధ్య హాయిగా సాగిపోయే జీవితం. ఆ జీవన విధానాన్ని, వాళ్ల ఫుడ్​ కల్చర్‌‌‌‌నే తన వీడియోల్లో చూపించి సక్సెస్‌‌ అయ్యాడు అపోలస్ కెంట్. మన దేశం నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అతని వీడియోలు చూస్తున్నారు. మొదటి వీడియోతోనే ఓవర్‌‌నైట్ స్టార్‌‌గా మారినా ఇప్పటికే తనను తాను ఒక రైతుగానే చెప్పుకుంటాడు కెంట్‌‌.

అపోలస్ కెంట్ నాగాలాండ్‌‌లోని సెండెన్యు గ్రామంలో 1990లో పుట్టాడు. వాళ్లది ఒక చిన్న పల్లెటూరు. రెంగ్మా అనే నాగా గిరిజన తెగకు చెందినవాడు. పది మంది తోబుట్టువుల్లో అతనే చిన్నవాడు. ఆ కుటుంబానికి తెలిసింది వ్యవసాయం మాత్రమే. తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేదు. అందుకే 11వ తరగతి మధ్యలోనే చదువు మానేశాడు. తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లేవాడు. తర్వాత కొన్నాళ్లు కోహిమాలో ఫీల్డ్ స్టాఫ్‌‌గా పనిచేశాడు. పెండ్లి చేసుకున్నాక కుటుంబ భారం మరింత పెరిగింది. దాంతో బతుకుదెరువు కోసం ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. దానిమీద వచ్చిన ఆదాయంలో కొంత దాచుకుని ఒక స్మార్ట్‌‌ఫోన్ కొన్నాడు. అదే అద్భుత దీపంలా కెంట్ జీవితాన్ని మార్చేసింది.

యూట్యూబ్‌‌లో వీడియోలు చూసి.. 

కెంట్‌‌ ఫోన్‌‌ కొన్నాక అందులో యూట్యూబ్‌‌ వీడియోలు చూసేవాడు. అలా అతనికి కూడా వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే 2018 ఆగస్టులో ‘సెల్ఫ్ థాట్ వ్లాగర్’ పేరుతో మొదటి యూట్యూబ్‌‌ చానెల్ స్టార్ట్ చేశాడు. అప్పటివరకు అతని దగ్గర ఎలాంటి ప్రొఫెషనల్ ఎక్విప్‌‌మెంట్ లేదు. మొబైల్‌‌తోనే వీడియోలు షూట్ చేసేవాడు. ఆ వీడియోలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సక్సెస్‌‌ కోసం ఇంకా ఏదైనా చేయాలని ఎప్పుడూ తపించేవాడు. అదే టైంలో మార్క్ వీయన్స్ లాంటి ఫుడ్ వ్లాగర్లను చూసి ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయ్యాడు. అతనిలానే వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కొన్ని వైరల్ కూడా అయ్యాయి. కానీ, అప్పుడే అతని చానెల్ హ్యాక్ అయింది. అంతా కోల్పోయినట్టు అనిపించింది. కానీ.. పట్టు వదలకుండా కెంట్ మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. 

రెండో ప్రయత్నం

కెంట్ జీవితంలో 2020 కరోనా లాక్‌‌డౌన్ పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ టైంలో కెంట్‌‌ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడే అతనికి కొరియన్ ముక్‌‌బాంగ్ ట్రెండ్ గురించి తెలిసింది. ఆ ట్రెండ్‌‌ ఏంటంటే.. భారీగా ఫుడ్‌‌ తిని వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటారు. కెంట్‌‌ ఆ ట్రెండ్‌‌ని తన సంస్కృతితో మిళితం చేశాడు. గ్రామీణ జీవనం, సంప్రదాయ నాగా ఫుడ్‌‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మొదటి వీడియోలో.. బురద పొలం నుంచి నత్తలను తీసుకొచ్చాడు. వాటిని సంప్రదాయ పద్ధతిలో మొక్కజొన్నతో కలిపి రాజా మిర్చి(చాలా కారంగా ఉంటుంది)తో వండి తిన్నాడు. ఆ వీడియోని ‘కెంట్స్‌‌ వ్లాగ్‌‌’ పేరుతో పెట్టిన తన కొత్త యూట్యూబ్‌‌ చానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్‌‌ అయ్యింది. దానికి నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం చానెల్‌‌ను 9.34 లక్షల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. కెంట్‌‌ నాగాలాండ్‌‌లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అయినప్పటికీ తనను తాను ఇప్పటికీ రైతుగానే చెప్పుకుంటాడు. 

జర్నీలో ఎన్నో  సవాళ్లు 

యూట్యూబ్ జర్నీలో కెంట్‌‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. టెక్నాలజీ మీద పట్టు లేకపోవడం వల్ల చానెల్ హ్యాక్ అయ్యింది. కానీ, కెంట్ ఎప్పుడూ నిరాశ చెందలేదు. భార్య అసిన్లే ప్రోత్సాహం, అతని ముగ్గురు కొడుకులే కెంట్‌‌ బలం. మొదట్లో చాలామంది నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు.  ‘‘ఎంతోమంది మమ్మల్ని చూసి నవ్వుతుంటారు. కానీ.. నేను ‘నాగా’ అని గర్వంగా చెప్పుకుంటున్నాను” అని అతను చెప్పే మాటలు హృదయాన్ని తాకుతాయి. ఎంతో కష్టపడి ఎడిటింగ్ నేర్చుకున్నాడు. చానెల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇంట్లోకి ఫ్రిజ్, బైక్, కారు కొన్నాడు.

నాగా కల్చర్‌‌‌‌

కెంట్‌‌ వీడియోలు కేవలం ముక్‌‌బాంగ్ మాత్రమే కాదు. నాగా జీవన విధానం, సంప్రదాయాలు, ఆహార సంస్కృతి.. ఇలా అన్నింటినీ చూపిస్తాయి. పోర్క్ కర్రీ, క్రాబ్ ఎగ్ చట్నీ, ఫెర్మెంటెడ్ బంబూ షూట్స్, సిల్క్‌‌వార్మ్స్.. లాంటి వీడియోలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. చానెల్‌‌లో వీడియోలన్నీ అతని భార్య అసిన్లే షూట్‌‌ చేస్తోంది. ఆమె  కూడా పెద్దగా చదువుకోలేదు. అయినా ఎంతో నేర్చుకుని వీడియోలు షూట్ చేస్తోంది. మొదట్లో రూ. 10 వేలు పెట్టి కొన్న ఒక చైనీస్ ఆండ్రాయిడ్ ఫోన్‌‌తోనే వీడియోలు తీసేవాళ్లు. వాళ్లది మారుమూల ప్రాంతం కావడంతో ఇంటర్నెట్ సరిగ్గా ఉండదు. సిగ్నల్‌‌ కాస్త ఎక్కువగా వచ్చే చోట కిచెన్ బయట పూల కుండీ మీద ఫోన్‌‌ పెట్టి యూట్యూబ్‌‌లో వీడియో అప్‌‌లోడ్ చేస్తుంటాడు.