కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) వేదికగా ఆపిల్ సంస్థ ఒక పెద్ద ప్రకటన చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ కంప్యూటర్లను మరింత వేగంగా, స్మార్ట్‌గా మార్చేందుకు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లేటెస్ట్ అప్‌గ్రేడ్ చేసిన ‘సిరి’ (Siri) వాయిస్ అసిస్టెంట్‌ను పరిచయం చేసింది.
ఆపిల్ సిరిలో మార్పులు ఏంటి అంటే ఇకపై సిరి మీ ఫోన్ స్క్రీన్ మీద ఏముందో చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇంకా మీ పర్సనల్ సమాచారాన్ని బట్టి, ఫోన్ లోని వేర్వేరు యాప్స్ లో ఉన్న డేటాను వెతికి పెడుతుంది. ఏదైనా పెద్ద విషయం గురించి అడిగితే, ఇంటర్నెట్ లో వెతికి సరైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే వినియోగదారుల పర్సనల్ డేటా చోరీకి గురికాకుండా, చాలా సేఫ్‌గా ఉండేలా ఈ కొత్త టెక్నాలజీని డిజైన్ చేశారు.
సిరి కాకుండా మిగతా యాప్స్‌లో కొత్త ఫీచర్లు ఏంటంటే... కేవలం సిరి మాత్రమే కాకుండా ఫోటోస్, సఫారీ బ్రౌజర్, మెసేజెస్, మెయిల్ వంటి డైలీ ఉపయోగించే యాప్స్‌లో కూడా AI ఫీచర్లు వస్తున్నాయి. ఇక ఫోటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత ఈజీ అండ్ స్మూత్ అవుతుంది. రోజూ చేసుకునే పనుల సమయం తగ్గి, ఫోన్ వాడకం చాలా సహజంగా మారుతుంది.
పిల్లల భద్రత కోసం కొత్త రూల్స్
పిల్లలు ఫోన్లు ఎలా వాడుతున్నారో కనిపెట్టడానికి తల్లిదండ్రులకు మరిన్ని రైట్స్ ఇచ్చారు. ఇక పిల్లల వయసుకు తగ్గట్టుగా ఏ యాప్స్ ఉండాలో ముందే సెట్ చేయవచ్చు. కొత్తవారితో చాట్ చేసేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయవచ్చు. ఏదైనా చాట్ మెసేజ్‌లలో చెడు లేదా హింసాత్మకమైన ఫోటోలు, సమాచారం వస్తే సిస్టమ్ ఆటోమేటిక్‌గా వాటిని ఆపేస్తుంది.
యాపిల్ వాచ్ & ‘ఫైండ్ మై’ యాప్
యాపిల్ వాచ్ ఇకపై మీరు వాడే విధానాన్ని బట్టి, సిరి సూచించే ఒక 5 ముఖ్యమైన యాప్స్‌ను స్క్రీన్ పై చూపిస్తుంది. వాచ్‌ను కేవలం చేతి సైగలతో (Gestures) వేగంగా ఆపరేట్ చేయవచ్చు. ఇంకా ఫోన్లు, వస్తువులు, మనుషులను ట్రాక్ చేసే ఫీచర్లన్నింటినీ కలిపి ఒకే ‘ఫైండ్ మై’ (Find My) యాప్‌గా మార్చారు.
వినియోగదారులకు ఎప్పటి నుంచి అంటే
సాఫ్ట్‌వేర్ తయారుచేసే డెవలపర్లకు ఈ ఫీచర్లు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ప్రజల కోసం వచ్చే నెలలో 'పబ్లిక్ బీటా' అంటే టెస్టింగ్ వెర్షన్ విడుదలవుతుంది. దీని ద్వారా అందరి కంటే ముందే ఈ కొత్త AI ఫీచర్లను వాడి చూడోచ్చు.
