జిమ్‌కు వెళ్లేవారికి జుట్టు ఎక్కువగా రాలుతోందా..? డాక్టర్లు ఏమంటున్నారంటే..!

 జిమ్‌కు వెళ్లేవారికి జుట్టు ఎక్కువగా రాలుతోందా..?  డాక్టర్లు ఏమంటున్నారంటే..!

ఈ రోజుల్లో చాలా మంది యువకులు బాడీని త్వరగా ఫిట్ గా మార్చాలనే ఉద్దేశంతో కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు, రకరకాల సప్లిమెంట్లు వాడుతుంటారు. అలాంటప్పుడే వారి జుట్టు పల్చబడటం కూడా గమనిస్తుంటారు. ఈ ఆందోళన కలగడం సహజం. అయితే, యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ డాక్టర్  ప్రకారం... ఈ రెండింటికీ అనుకున్నట్లు డైరెక్ట్ గా  సంబంధం లేదు. కానీ కేవలం వ్యాయామం చేయడం వల్లే జుట్టు రాలడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్  చెప్తున్నారు.

అసలు కారణం ఏంటంటే... బాడీని త్వరగా మార్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది కఠినమైన డైటింగ్  పాటిస్తారు, సరిగ్గా నిద్రపోరు, శరీరానికి కావలసిన పోషకాలు అందవు. వీటన్నింటి వల్ల శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ ఒత్తిడే జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది.

బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అయ్యే వారిని లేదా త్వరగా బరువు తగ్గాలనుకునే వారిని చూస్తే... వారు తినే ఆహారాన్ని ఒక్కసారిగా  తగ్గిస్తారు, గంటల తరబడి వర్కౌట్స్ చేస్తారు, కానీ బాడీ రెస్ట్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వరు. బరువు తగ్గుతున్నట్లు   కనిపించినప్పటికీ, లోపల శరీరం మాత్రం ఈ మార్పులను తట్టుకోలేక ఒత్తిడికి గురవుతుంది.

మన శరీరంలో జరిగే మార్పులను జుట్టు చాలా త్వరగా పసిగడుతుంది. శరీరంలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లాంటి ముఖ్యమైన పోషకాలు తగ్గినప్పుడు, జుట్టు పెరిగే ప్రక్రియ ఆగిపోతుంది. కఠినమైన డైటింగ్ చేసేవారిలో, వేగంగా బరువు తగ్గే వారిలో ఇటువంటి పోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్ తెలిపారు.

►ALSO READ | AIకాలంలో తల్లితండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన 5 సూపర్ లైఫ్ స్కిల్స్ ఇవే !

చాలా సందర్భాలలో, ఈ విధంగా జుట్టు రాలడం అనేది తాత్కాలికమే. శరీరం ఒత్తిడికి గురైన కొన్ని వారాలకో లేదా నెలలకో ఈ ప్రభావం బయటపడుతుంది. అందుకే, అసలు కారణాన్ని వదిలేసి జిమ్ వల్లే జుట్టు ఊడుతోందని చాలా మంది తప్పుగా అనుకుంటారు.

జుట్టు రాలడానికి అసలు కారణం  
సప్లిమెంట్లు, కఠినమైన వర్కౌట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా... పురుషులలో బట్టతల రావడానికి ముఖ్య కారణం జన్యువులే (Heridity). కొంతమంది పురుషులలో ఉండే కేశ కుదుళ్లు (Hair follicles) పుట్టుకతోనే 'DHT' (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్‌ను తట్టుకోలేవు.  ఈ DHT హార్మోన్ జుట్టు కుదుళ్లను చిన్నవిగా చేసేస్తుంది. దీనివల్ల ప్రతిసారీ జుట్టు సన్నగా, బలహీనంగా మొలుస్తుంది. చివరికి అక్కడ అస్సలు జుట్టు పెరగడమే ఆగిపోతుంది. మీరు వారానికి ఆరు రోజులు జిమ్‌కు వెళ్లినా, లేదా అస్సలు  వెళ్లకపోయినా... మీ జన్యువులలో బట్టతల వచ్చే అవకాశం ఉంటే అది జరిగి తీరుతుంది.

స్టెరాయిడ్లు 
ఫిట్‌నెస్ ప్రపంచంలో జుట్టు రాలడానికి డైరెక్ట్  ప్రభావం చూపే ఒకే ఒక్క విషయం. స్టెరాయిడ్స్ వాడటం. బాడీని త్వరగా పెంచడానికి వాడే ఇటువంటి మందులు శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను విపరీతంగా పెంచేస్తాయి. జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉన్న పురుషులు వీటిని వాడినప్పుడు, వారి శరీరంలో DHT స్థాయిలు మరింత పెరిగి, జుట్టు చాలా వేగంగా పల్చబడిపోతుంది. అందుకే ఒకే రకమైన స్టెరాయిడ్ వాడినా ఇద్దరు వ్యక్తుల్లో వేర్వేరు ఫలితాలు ఉంటాయి. ఒకరికి జుట్టు విపరీతంగా ఊడిపోతే, మరొకరికి ఏ మార్పూ కనిపించకపోవచ్చు. జుట్టు రాలడానికి అసలైన కారణం జన్యువులే. అయితే, బాడీ బిల్డింగ్ కోసం వాడే స్టెరాయిడ్లు దీనిని మరింత త్వరగా ఎక్కువ చేస్తాయి.