సిడ్నీ: ఇండియా యంగ్ షట్లర్లు ఎంఆర్ అర్జున్–హరిహరన్ జోడీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం (జూన్ 10) జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో అర్జున్–హరిహరన్ 21–13, 21–13తో అర్డెన్ క్విన్ లీ–స్టాన్లీ జింగ్ (అమెరికా)పై గెలిచారు.
27 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్లు ర్యాలీలతో హోరెత్తించారు. బలమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు విన్నర్లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరో మ్యాచ్‌లో అచ్చుతాదిత్య రావు–అర్జున్ రెడ్డి జంట 15–21, 15–21తో కంకి ఇగావా –వూయ్ హెర్న్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు.
అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లలో సనీత్ దయానంద్ 21–17, 21–15తో కారోనో (ఆస్ట్రేలియా)పై, 21–9, 21–16తో మింగ్ హాంగ్ లిమ్ (మలేసియా)పై గెలిచి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మన్‌రాజ్ సింగ్ 11–21, 18–21తో యుజీన్ యూ (మలేసియా) చేతిలో ఓడాడు.
