అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

పాకిస్థాన్ టెస్ట్ బ్యాటర్ అసద్ షఫీక్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు దశాబ్ద కాలంగా పాక్ టెస్టు క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ వెటరన్ ప్లేయర్.. నిన్న(డిసెంబర్ 10) న తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.  ఇటీవలే పాక్ చీఫ్ సెలక్షన్ కమిటీలో షఫీక్ భాగమైన సంగతి తెలిసిందే. చాలా మంది పాక్ క్రికెటర్లు అనేక కుంభకోణాల్లో నిషేధం ఎదుర్కొంటే షఫీక్ మాత్రం ఎలాంటి వివాదాలు, విమర్శలు లేకుండా తన క్రికెట్ కెరీర్ ముగించాడు. 

రిటైర్మెంట్ అనంతరం మాట్లాడుతూ... "క్రికెట్ ఆడే ఉత్సాహం  నా దగ్గర లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన ఫిట్‌నెస్ స్థాయిలు కూడా నాకు లేవు. అందుకే నేను అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. జాతీయ సెలెక్టర్‌గా పనిచేయడం తనకు ఒక ఉత్తేజకరమైన సవాల్. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను తొలగిపోవాలని ఎవరూ బలవంతం చేయలేదు". అని అసద్ షఫీక్ చెప్పుకొచ్చాడు. జాతీయ సెలెక్టర్‌గా ఉండటానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందంపై సంతకం చేయబోతున్నట్లు అసద్ ధృవీకరించారు.

2010 నుండి 2020 వరకు పాకిస్తాన్ టెస్ట్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో షఫీక్ వెన్నెముకగా నిలిచాడు. 2010లో దక్షిణాఫ్రికా మీద తొలి టెస్టు ఆడిన ఈ వెటరన్ ప్లేయర్.. 2020లో ఇంగ్లాండ్ పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన టెస్ట్ కెరీర్ లో 77 మ్యాచ్ లాడిన ఈ 38 ఏళ్ళ బ్యాటర్..38.19 సగటుతో 4660 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలతో పాటు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజహర్ అలీ, యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్‌ లాంటి దిగ్గజాలతో కలిసి ఆడిన షఫీక్.. పాకిస్థాన్ టెస్టు బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచారు.