యాషెస్ సిరీస్: ఇంగ్లండ్ 147 ఆలౌట్

యాషెస్ సిరీస్: ఇంగ్లండ్ 147 ఆలౌట్
  • 5 వికెట్లుతో సత్తా చాటిన కమిన్స్
  • టాస్ గెలిచినా పిచ్ అంచనాలో దెబ్బతిన్న ఇంగ్లండ్

బ్రిస్బేన్‌: యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్ కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా బౌలింగ్ విధ్వంసంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కేవలం 147 పరుగులకే ఆలౌట్ అయింది. యాషెస్ సిరీస్ లో  భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభం అయింది.  టాస్ గెలిచిన ఇంగ్లండ్ పిచ్ ను అంచనా వేయడంతో ఘోరంగా విఫలమై ఆసీస్ బౌలర్ల ముందు మోకరిల్లింది. 
తొలి రోజే ఆ జ‌ట్టు కేవ‌లం 147 పరుగులకు ఆలౌటైందంటే ఆస్ట్రేలియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లండ్ బ్యాటర్లు పేలవ బ్యాటింగ్ కు నిదర్శనంలా నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పీడ్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి సత్తా చాటాడు.  ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ తొలి బంతికే.. రోరీ బ‌ర్న్స్ క్లీన్ బౌల్డ‌య్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో రోరీ ఔట్ కావడంతో ఇంగ్లండ్ కు షాక్ తగిలింది. ఆ దెబ్బ నుండి కోలుకోలేక పోయింది. తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత రెండో సెష‌న్‌లో క‌మ్మిన్స్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ‌ట్ల‌ర్ ఒక్కడే  కొంత మేర‌కు ఆసీస్ బౌల‌ర్ల‌ను దీటుగా ప్ర‌తిఘ‌టించాడు. అయినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువ‌లేక‌పోయాడు. స్టార్క్‌, హేజ‌ల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయ‌గా.. గ్రీన్ ఖాతాలో ఒక వికెట్ ప‌డింది.
తొలి బంతికే వికెట్ తో స్టార్క్ అరుదైన ఘనత
యాషెస్ సిరీస్ లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలి బంతికే వికెట్ తీసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 1936లో ఎర్నీ మెక్ కార్మిక్ తొలిసారిగా ఇదే బ్రిస్బేన్ మైదానంలో తొలి బంతికే వికెట్ తీసి అరుదైన రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ఈ రికార్డు ఏడు దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా ఇవాళ ఇదే బ్రిస్బేన్ మైదానంలో స్టార్క్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ను తొలిబంతికే బౌల్డ్ చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు విశ్వరూపం చూపించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.