
- రిజర్వేషన్లను అడ్డుకుంటుంది ఆధిపత్య శక్తులే
- నల్గొండ గడియారం సెంటర్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక, బీసీ విద్యార్థి సంఘాల నాయకుల నిరసన
నల్గొండ అర్బన్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం నల్గొండలోని గడియారం సెంటర్‌లో 42 శాతం రిజర్వేషన్ల పట్ల ఆధిపత్య కులాల కుట్రలను నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో బీసీలు చేసిన ఉద్యమాల ఫలితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ వద్దకు పంపారన్నారు. ఆధిపత్య శక్తులు అడుగడుగునా రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో 60 శాతానికి పైబడి ఉన్న బీసీలు 42 శాతానికి అంగీకరించినప్పటికీ అడ్డుకోవడం ముమ్మాటికీ ఆధిపత్య శక్తుల కుట్రే అన్నారు. బీసీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం మాత్రమే పోరాడుతున్నారన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జోగు నాగేశ్ ముదిరాజ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గడగోజు విజయకుమార్, పట్టణ అధ్యక్షుడు చిన్నోజు రాజు , బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కన్నబోయిన రాజుయాదవ్, పొగాకు రవికుమార్ యాదవ్, శ్రీకాంత్, తరుణ్ యాదవ్, మహేశ్ శివ కుమార్ పాల్గొన్నారు.