పుట్టినరోజు నాడు స్పెషల్గా పెళ్లి

పుట్టినరోజు నాడు స్పెషల్గా పెళ్లి

పుట్టినరోజు స్పెషల్ గా ఉండాలని ఎవరైనా ఏం చేస్తరు. ఫ్రెండ్స్ తో మంచిగ దావత్ ప్లాన్ చేసుకుంటరు. ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తరు. లేదంటే గుడికెళ్తరు. కానీ ఈయన మాత్రం పెండ్లి చేసుకున్నడు.. వివరాళ్లోకి వెళితే...
అన్ని పెండ్లిళ్లలో ఉన్నట్టే ఈ పెండ్లిలో కూడా వధువు సిగ్గు పడ్డది. అది చూసి వరుడు చిరునవ్వు నవ్విండు. పెండ్లి కూడా ధూంధాంగా జరిగింది. దీంట్లో స్పెషల్‌ ఏంటంటే... వరునికి వందేండ్లైతే, వధువుకు తొంబై. తండ్రి వందో పుట్టిన రోజును కొడుకులు, కూతుళ్లు కలిసి ఇలా ఎప్పటికి గుర్తుండిపోయేలా చేయాలనుకున్నరు. అందుకే పెండ్లిని ప్లాన్‌ చేసిన్రు. అదే విషయం తాత, బామ్మకు చెప్తే, దానికి ఇద్దరూ ‘సై’ అన్నరు.
ఈయన పేరు విశ్వనాధ్ సర్కార్‌. భార్య సురోధిని. ఉండేది వెస్ట్‌ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌. వీళ్లకి 1953లో పెండ్లయింది. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ల సంతానం. 23 మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవళ్లు కూడా ఉన్నరు. 
వృత్తిరీత్యా వేరువేరు రాష్ట్రాల్లో స్థిరపడ్డ పిల్లలు, విశ్వనాధ్‌ వందో పుట్టిన రోజున వాళ్లకు ఎప్పటికి గుర్తుండి పోయేలా చేయాలని చుట్టాలందరిని పిలిచి గ్రాండ్‌గా మళ్లీ పెండ్లి చేయాలనుకున్నారు. అనుకున్నట్టే పెండ్లి కొడుకును మనవళ్లు రెడీ చేస్తే, పెండ్లి కూతుర్ని మనవరాండ్లు ముస్తాబు చేశారు. పెండ్లి మండపానికి గుర్రం మీద వచ్చిన విశ్వనాధ్​ని చూసి మురిసిపోయారు అందరు. తరువాత నోట్లతో చేసిన దండలు మార్చుకుని, వాళ్ల సంప్రదాయాల ప్రకారం పెండ్లి చేసుకున్నారు. దాదాపు 700 మందిని పిలిచి భోజనాలు పెట్టి గ్రాండ్‌గా పెండ్లి జరిపించారు వాళ్ల పిల్లలు.

వచ్చిన వాళ్లు ఈ ఎవర్‌‌ యంగ్‌ కపుల్‌ను ఆశీర్వదించారు. అంతేకాదు టపాసులు కాలుస్తూ, బారాత్‌ చేసి ఊరేగించారు. ‘పిల్లలకు భాధ్యతలు వచ్చాయి.  పిల్లల్ని మనవళ్లను కలవాలన్నా, వాళ్లతో ఉండాలన్నా అస్సలు కుదిరేది కాదు. ఈ వేడుకలో మళ్లీ అందర్నీ ఒక్కచోట చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నాడు విశ్వనాధ్. ‘చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడగా చూళ్లేదు. వాళ్లు మాకు చాలా ఆదర్శం’ అన్నారు కొడుకులు. ‘వాళ్లకోసం ఇలాంటి ఒక వేడుక చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాం’ అని మనవరాలు పాయల్‌ సర్కార్‌‌ చెప్పింది.