సీఎంకు మరో షాక్‌.. టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్

సీఎంకు మరో షాక్‌.. టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో  సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది.  ఈ కేసు విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్‌ కృష్ణ సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన టీఎంసీ నేతల సంఖ్య ముగ్గురికి చేరింది. ఈ కేసులో ఇప్పటికే  టీఎంసీ నేతలు సాహా మాణిక్‌ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్‌ అయ్యారు. 

బెంగాల్‌లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అభ్యర్థుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో రెండు సెక్షన్ల రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులు ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జిబాన్‌ను సీబీఐ స్పెషల్‌ టీమ్‌ ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు పాటు విచారించింది. విచారణ అనంతరం జిబాన్ కృష్ణను అరెస్ట్‌ చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో జిబాన్‌.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. 

చెరువులోకి ఫోన్లు

బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసిన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా జిబాన్‌ వాష్‌రూమ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో జిబాన్.. తన ఇంటి పక్కనే ఉన్న  చెరువులో  ఫోన్లను పడేశాడు. ఈ ఘటనతో అధికారులు షాకయ్యారు.