భైంసా సీఐకి రాష్ట్రస్థాయి అవార్డు

భైంసా సీఐకి రాష్ట్రస్థాయి అవార్డు
  • సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్​కు కూడా..

భైంసా/సారంగాపూర్, వెలుగు: భైంసా సీఐ గోపీనాథ్, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ సీఎం చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ రియల్​ హీరో అవార్డులు అందుకున్నారు. నిర్మల్​ డీసీఆర్​బీగా పని చేస్తున్న సమయంలో గోపీనాథ్, సారంగాపూర్​ఎస్సై శ్రీకాంత్ ​విశేష సేవలందించారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సారంగాపూర్​మహబూబ్ ​ఘాట్ వద్ద అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి లోయలో బోల్తా పడగా సమాచారం అందుకున్న గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్​ వెంటనే అక్కడకు చేరుకొని క్షతగాత్రులను కాపాడి వారిని క్షేమంగా హాస్పిటల్​కు తరలించారు. శాంతిభధ్రతల పరిరక్షణ, కమ్యూనిటీ పోలీసింగ్, విద్యార్థుల నేర ప్రవృత్తిని అరికట్టే కార్యక్రమాలు, మహిళల భధ్రతపై ప్రత్యేక చర్యలు, రాత్రి గస్తీ వ్యవస్థలో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు.

 విధి నిర్వాహణ, శాంతి భధ్రతల పరిరక్షణలో చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగా ఈ అవార్డు దక్కింది. సోమవారం హైదరాబాద్​లో నిర్వహించిన తెలంగాణ పోలీస్​ రియల్ ​హీరో-2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గోపీనాథ్, శ్రీకాంత్​ వేర్వేరుగా​అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది ఆయనను అభినందించారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని సీఐ​గోపీనాథ్​ అన్నారు.