అణుబాంబు .. జీవవైవిధ్య విధ్వంసం .. నిర్వీర్యమే పరిష్కారం

అణుబాంబు .. జీవవైవిధ్య విధ్వంసం .. నిర్వీర్యమే పరిష్కారం

కాల్పుల విరమణ చోటు చేసుకున్నా.. పాకిస్తాన్, ఇండియా మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం పోలేదనే చెప్పొచ్చు.  ఇరుదేశాలూ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలే అని ప్రచారం ఉంది.  కానీ, అది నిజమేనా,  వాటిని వాడే పరిస్థితిలో ఆయా దేశాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఏ దేశమైనా అణ్వాయుధాలు వాడితే జరిగే  విధ్వంసాన్ని,  దీర్ఘకాలికంగా  వాతావరణంపై, ఆరోగ్యంపై, గాలి,  నీరు, నేల, పర్యావరణం, జీవవైవిధ్యంపై పడే చెడు ప్రభావాల్ని ఈ వ్యాసంలో వివరించడం జరిగింది.  

అణుబాంబు విస్ఫోటనం తర్వాత తీవ్రమైన వేడి (మిలియన్ డిగ్రీల సెల్సియస్),  హానికరమైన రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదల అవుతాయి. విడుదల అయిన వేడికి వస్తువులు ఆవిరి రూపంలోకి మారతాయి.  విస్తృతమైన మంటలు,  భారీ మొత్తంలో పొగ ఉత్పత్తి అవుతుంది.  రేడియోధార్మిక పదార్థాలు  గాలిని కలుషితం చేస్తాయి. అధిక ఎత్తులో  ఏర్పడే పేలుళ్లు  నైట్రోజన్ ఆక్సైడ్‌లను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయి. అందువలన  అతి నీలలోహిత కిరణాలు భూమిపైకి వచ్చి చేరతాయి. అతి నీలలోహిత కిరణాల ప్రభావం చర్మ క్యాన్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

న్యూ క్లియర్​ వింటర్​(అణుశీతాకాలం) అంటే ఏడాది  పొడవునా శీతలీకరణ లేదా శీతాకాలం లాంటి వాతావరణ పరిస్థితులు ఉండటం. అణుయుద్ధం ఫలితంగా అణుశీతాకాలం ఏర్పడుతుంది. అణుయుద్ధం తర్వాత ఏర్పడే  వాతావరణ పరిస్థితి ఇది.  దీని వలన వాతావరణంలో  పెద్దమొత్తంలో  మసి, ధూళి ఏర్పడి వాతావరణంలో నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది. ఇది  సూర్యరశ్మిని భూమిపైకి పడకుండా చేసి  వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. 

 దీనివల్ల  సంవత్సరాల కొలది వాతావరణ ఉష్ణోగ్రత  1 నుంచి 5 డిగ్రీలC వరకు పడిపోతుంది.  మొక్కలు కిరణ జన్యసంయోగక్రియ ద్వారా ఆహారం ఉత్పత్తి చేయాలంటే సూర్యరశ్మి అవసరం. న్యూక్లియర్ వింటర్ వలన సూర్యరశ్మి లభించక ఆహార ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.  భూమిపై గల జీవరాశులు అన్నింటి  శక్తికి మూలం అయిన  సూర్యరశ్మి లభించకపోతే భూమిపైగల అనేక జీవావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం నశించిపోతుంది.  పొగ, ఏరోసోల్‌లు హైడ్రొలాజికల్ సైకిల్ (నీటిచక్రం)కు అంతరాయం కలిగిస్తాయి.  ఇది కరువులు, క్రమరహిత వర్షపాతానికి దారితీస్తుంది. 

నదులు, సరస్సులు, భూగర్భజలాలపై ప్రభావం

అణుబాంబు విస్ఫోటనంలో విడుదల అయిన రేడియో ధార్మిక పదార్థాలు ఉపరితల నీటిని (నదులు, సరస్సులు)  భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి.  అందువలన ఇవి తాగడానికి లేదా గృహ అవసరాలకు లేదా వ్యవసాయానికి పనికిరావు.  వాతావరణంలోని రేడియోధార్మిక  పదార్థాల వలన ఏర్పడే ఆమ్లవర్షం నీటి నాణ్యతను మరింత దిగజార్చుతుంది. 

అణుబాంబు విధ్వంసం తర్వాత విడుదల అయ్యే రేడియో ధార్మిక పదార్థాలు, నేల, వ్యవసాయ భూములలో  నిక్షిప్తం అయ్యి  దశాబ్దాలు లేదా శతాబ్దాలుగా భూమిని నిస్సారంగా, ప్రమాదకరంగా మార్చుతాయి.  అందువలన ఆహార ఉత్పత్తిపై  దీని ప్రభావం పడుతుంది.ఆహారపు గొలుసు ద్వారా కాలుష్యం బదిలీవేడి,  రేడియేషన్.. వృక్షజాలం, జంతుజాలంలో  జన్యు ఉత్పరివర్తనలు, పునరుత్పత్తి వైఫల్యం, సామూహిక మరణాలకు కారణమవుతుంది. 

సున్నితమైన జాతులు అంతరించిపోవచ్చు. రేడియో ధార్మికతతో  కలుషితమైన మొక్కలు, జంతువులు ఆహార గొలుసు ద్వారా ‘బయోమాగ్నిఫికేషన్’ అనే ప్రక్రియ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు ఒక జీవి నుంచి మరొక జీవికి బదిలీ అవుతాయి.  దీనివల్ల ఒక జీవావరణ వ్యవస్థలోని జంతువులన్నీ నశించిపోతాయి.  ఉదాహరణకు  ఒక ఉపరితల నీటి వ్యవస్థ, రేడియోధార్మిక పదార్థాలచే కలుషితమైనట్లయితే,  జీవావరణ వ్యవస్థలో మొదటి స్థానంలో ఉండే  నీటి మొక్కలు, తర్వాత  రెండోస్థానంలో ఉండే  మొక్కలను  తినే చేపలు, ఇతర జలచరాలు, తర్వాత మూడోస్థానంలో ఉండే చేపలను, జలచరాలను తినే మాంసాహారులు,  మానవుల శరీరాలలోనికి  రేడియోధార్మిక పదార్థాలు బదిలీ అవుతాయి. ఈ విధంగా ఆహారపు గొలుసు ద్వారా ఒక కాలుష్య పదార్థం బదిలీ అవ్వటాన్ని ‘బయో మాగ్నిఫికేషన్’ అని అంటారు. రేడియో ధార్మిక  పదార్థాలు పూర్తిగా నిర్వీర్యం కావడానికి కొన్ని వందల నుంచి వేల సంవత్సరాల  సమయం పట్టవచ్చును.  వాతావరణంలోనికి  విడుదల అయిన రేడియోధార్మిక పదార్థాలను నిర్వీర్యం చేయడం అసాధ్యం.  హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి, చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ దుర్ఘటన మొదలగునవి

  •  అణువిధ్వంసానికి మంచి ఉదాహరణలు..
  • హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు విధ్వంసం  

1945 ఆగస్టు 6న హిరోషిమాపై వేసిన అణుబాంబు పేరు లిటిల్ బాయ్.  ఇది 15,000 టన్నుల ‘ట్రై నైట్రో టోలిన్’ (టి.యన్. టి)కి సమానమైన పేలుడు శక్తిని కలిగినది.  పేలుడు సెకండ్ల  కాలవ్యవధిలో  అనేక మిలియన్ డిగ్రీల సెల్సియస్ (3,000,000 డిగ్రీలC నుంచి 6,000,000 డిగ్రీలC వరకు అంచనా) వరకు ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసింది. ఇది దాదాపు 70 శాతం  భవనాలను ధ్వంసంచేసి తగలబెట్టింది. 1945 చివరినాటికి 1,40,000 మంది మరణాలకు  కారణమైంది. అంతేకాకుండా ప్రాణాలతో బయటపడినవారిలో  క్యాన్సర్,  దీర్ఘకాలిక వ్యాధులు సోకే  రేటు పెరిగింది. మూడు రోజుల తరువాత నాగసాకిపై వేసిన అణుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్.  అణుబాంబు ఫ్యాట్ మ్యాన్ బాంబు పేలి నగరం  చాలావరకు  నేలమట్టమైనది.  

1945 చివరినాటికి 74,000 మంది మరణించారు.  భూమి ఉష్ణోగ్రతలు 4,000 డిగ్రీలCకి చేరుకున్నాయి. రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విపరీతంగా విడుదల అయ్యాయి.  ఒక నగరంపై అణ్వాయుధం పేలితే, అత్యవసర సేవలు అందించే  ఆసుపత్రులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయ సంస్థలు మొదలగునవి సహాయం అందించటం దాదాపు అసాధ్యం.  ఎందుకంటే అణుబాంబు దాడిలో అత్యవసర సేవలు అందించే వారు సైతం మరణిస్తారు లేదా గాయపడతారు.   1945లో హిరోషిమా, నాగసాకిలలో అణుబాంబు దాడిలో  90 శాతం మంది వైద్యులు, నర్సులు మరణించడం, తీవ్రంగా గాయపడటం జరిగింది. 45 ఆసుపత్రులలో 42 ఆసుపత్రులు పనిచేయడం మానేశాయి.  70 శాతం మంది బాధితులకు  తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయి.

శతాబ్దాలపాటు అణువిస్ఫోటన ప్రభావం

అణుబాంబు దాడుల తర్వాత బాధితులకు సహాయం అందించడానికి  హిరోషిమా, నాగసాకి నగరాలలోకి వచ్చినవారు సైతం రేడియేషన్ కారణంగా మరణించారు. హిరోషిమా,  నాగసాకి నగరాలపై బాంబు దాడుల తర్వాత ఐదు నుంచి ఆరు సంవత్సరాల తరువాత ప్రాణాలతో బయటపడినవారిలో లుకేమియా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  దాదాపు ఒక దశాబ్దం తర్వాత, ప్రాణాలతో బయటపడినవారు సాధారణం కంటే ఎక్కువ రేటుతో థైరాయిడ్, రొమ్ము, ఊపిరితిత్తులు, ఇతర క్యాన్సర్లతో  బాధపడటం ప్రారంభించారు. బాంబుదాడులకు గురైన గర్భిణీలు  గర్భస్రావాలకు గురి అయ్యారు.

 పుట్టిన పిల్లలకి అంగవైకల్యం, శారీరక బలహీనతలతో బాధపడ్డారు. అణుబాంబు దాడి జరిగిన  ఏడు దశాబ్దాల తర్వాత కూడా నేటికీ బతికి ఉన్నవారందరికీ రేడియేషన్​కు గురికావటం వలన సంభవించే క్యాన్సర్  కేసుల రేటు పెరుగుతూనే  ఉంది. దుష్ఫలితాలను  నేటికీ అనుభవిస్తూనే ఉన్నారు. 

ఏ నగరంపైన అయిన అణుబాంబు దాడి జరిగితే  ప్రాణాలతో బయటపడినవారికి చికిత్స చేయటానికి  అవసరమైన  ప్రత్యేక 'బర్న్ బెడ్‌లు'  సరిపోవు.  అణువిస్ఫోటనం నుంచి వచ్చే అగ్నిగోళం గరిష్ట పరిమాణాన్ని చేరుకోవడానికి దాదాపు 10 సెకన్లు  పడుతుంది, కానీ, దాని ప్రభావాలు దశాబ్దాలు, శతాబ్దాల పాటు తరతరాలుగా  కొనసాగుతాయి. 

అణుబాంబులను నిర్వీర్యం చేయగలమా?  

అణుబాంబులను కలిగిన దేశాలు వివిధ దౌత్య మార్గాల ద్వారా యుద్దాలను నివారించుకోవాలి. హిరోషిమా, -నాగసాకి అణుబాంబు విధ్వంసకర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భూగోళానికి పెనుముప్పుగా మారిన అణుబాంబుల తయారీని, అణుబాంబు యుద్ధాలను  ప్రపంచవ్యాప్తంగాఅన్ని దేశాలు నివారించాలి,  నిషేధించాలి. అణుబాంబులను తయారు చేయడం ఎంత ప్రమాదకరమో వాటిని నిర్వీర్యం చేయడం కూడా సంక్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ.  సంబంధిత టెక్నాలజీతో  నిర్వీర్యం చేయొచ్చని అణు నిపుణులూ చెపుతున్నారు. ఇది కేవలం దేశాల సమస్య కాదు, 800 కోట్ల ప్రపంచ ప్రజల  సమస్య.  కాబట్టి ప్రపంచం ఏకోన్ముఖంగా గొంతెత్తాలి. ఆయా దేశాల వద్ద ఉన్న ఆణ్వాయుధాలను నిర్వీర్యం చేయాలని ఐక్యరాజ్యసమితి పూనుకోవాలి. మనకున్నది ఒకే గ్లోబ్​, దాన్ని కాపాడుకుందాం!

అణ్వాయుధ దేశాలు 

అమెరికన్ సైంటిస్ట్స్ ఫెడరేషన్,  ‘స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ’ వంటి వాటినుంచి సేకరించిన డేటా ప్రకారం అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలు.. రష్యా (5,580), అమెరికా (5,044), చైనా (500), ఫ్రాన్స్ (290), యూకే (225), భారతదేశం (172),  పాకిస్తాన్ (170), ఇజ్రాయెల్ (90),  ఉత్తర కొరియా (50) అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్​ కూడా అణ్వాయుధాలు తయారు చేస్తున్నదని వార్తలు విన్నాం.  అలాగే ఏదేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయనేది ఆయా దేశాల ద్వారా లభించిన సోర్స్​  మాత్రమే.  నిజానిజాలు తెలియవు.  కానీ, అణ్వాయుధాలు కలిగి ఉండటమే తమ దేశానికి భద్రత అనే ధోరణి నుంచి ప్రపంచ  దేశాలు బయటకురావాలి.

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్-