వారసత్వ రాజకీయాలను సమాధి చేసే పార్టీ బీజేపీ

వారసత్వ రాజకీయాలను సమాధి చేసే పార్టీ బీజేపీ
  • బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు

హైదరాబాద్: దేశంలో వారసత్వ రాజకీయాలను సమాధి చేసే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పార్టీ వారసత్వ పార్టీ.. దమ్మున్న పార్టీ బీజేపి అని ఆయన స్పష్టం చేశారు. సోమాజిగూడలోని కత్రీయ హోటల్ లో దళితుల అభివృద్ధి.. బీజేపీ సంకల్పం పై సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం పని చేసే పార్టీ బీజేపి అన్నారు. తమ పార్టీ మినహా రాష్ట్రంలో అన్ని పార్టీలన్నీ కోవర్ట్ పార్టీలేనని ఆయన విమర్శించారు. అమ్ముడు పోని పార్టీ ఒక్క బీజేపీనేనని స్పష్టం చేసిన ఆయన టీఆర్ఎస్ పార్టీ కండ్లల్లో కన్ను పెట్టీ చూసే పార్టీ బీజేపి అని తెలిపారు. దళితుల ఓట్ల కోసం రాజకీయం చేసే పార్టీ తమది కాదని.. ఒక  సిద్దాంతం కలిగిన పార్టీ అని ఆయన వివరించారు. దళితుల సాధికారత, అభివృద్ధి కోసం బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాణం చేయగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమేనని మహాత్మా గాంధీ సూచించారని గుర్తు చేస్తూ.. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం భారత దేశాన్ని తీర్చిదిద్దే పార్టీ బీజేపి అన్నారు. 12 మంది షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ఘనత తమదేనన్నారు. 
బ్యాంకు ఖాతాలేని వ్యక్తికి ఎన్నో వివక్షలు ఎదురవుతున్నాయని 40కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. జనదన్ ఖాతాలో ఎస్సీలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని ఆయన చెప్పారు. ఇళ్లులేని కుటుంబాలు ఎక్కువగా ఉన్నవి షెడ్యూల్ క్యాస్ట్ లో మాత్రమేనని... అందుకే ప్రతి షెడ్యూల్ క్యాస్ట్ వారికి సొంత ఇల్లు ఇవ్వడమే మోదీ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. సొంత ఇల్లు సాకారం చేసేందుకే మోదీ అవాస్ యోజన పథకం తీసుకువచ్చారని తెలిపారు. మోదీ ప్రభుత్వం స్టార్డప్ పేరుతో దళితులను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు మోదీ తీసుకువస్తున్నారని మురళీధర్ రావు వివరించారు.