కనీస మద్దతు ధర రెట్టింపే బీజేపీ లక్ష్యం: బండి సంజయ్

కనీస మద్దతు ధర రెట్టింపే బీజేపీ లక్ష్యం: బండి సంజయ్
  •     పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై హర్షం 
  •     రైతుల మేలు కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: డీకే అరుణ 

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ రైతు పక్షపాతి అని, పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశ రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. యూపీఏ పాలనతో పోలిస్తే పంటల మద్దతు ధరలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు మద్దతు ధరలను ప్రకటించిన నేపథ్యంలో సంజయ్ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వడ్లకు మద్దతు ధరను క్వింటాల్ కు రూ.143 పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పత్తి, పల్లి, పెసర్లు, మినుములు, కందుల ఎంఎస్పీని కూడా పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1,360 ఉంటే, తాజాగా రూ.2,183కు చేరుకుందని.. గతంతో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823 పెరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400, మినములకు రూ.350 మేరకు ఎంఎస్పీని కేంద్రం 
పెంచిందన్నారు.

పెట్టుబడి కంటే 50% అధికం: డీకే అరుణ

ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీని పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎంఎస్పీని పెంచడం ద్వారా రైతుల మేలు కోసం కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాని మోడీ సర్కార్ చాటుకుందని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోందని తెలిపారు. మద్దతు ధర పెంపుతో మోడీ సర్కార్.. రైతు సర్కార్ అని మరోసారి రుజువైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.