దేశంలో అరాచకం సృష్టించే కుట్ర

దేశంలో అరాచకం సృష్టించే కుట్ర
  • ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ ఫైర్
  • ఓట్ల చోరీకి స్పష్టమైన ఆధారాల్లేవు: ధర్మేంద్ర ప్రధాన్
  • దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నరు: శివరాజ్​సింగ్ చౌహాన్

న్యూఢిల్లీ: దేశంలో అరాచకం, అస్థిరత సృష్టించడానికే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ‘పార్లమెంట్‌‌‌‌ టు ఈసీ’ ర్యాలీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సర్’పై వినతిపత్రం స్వీకరించేందుకు 30 మంది ఎంపీల బృందానికి ఈసీ అనుమతిచ్చిందని తెలిపింది. 200 మందికిపైగా ఎంపీలు దూసుకొస్తే పోలీసులు అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించింది. బీజేపీ హెడ్​క్వార్టర్స్​లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు.

 బీజేపీ, ఎన్నికల కమిషన్​ను ఉద్దేశిస్తూ రాహుల్ చేస్తున్న కామెంట్లన్నీ అబద్ధాలు అని మండిపడ్డారు. ‘‘నిరసన తెలియజేసేందుకు వేరే సమస్యలేవీ లేకపోవడంతో ‘ఓట్ల చోరీ’ అంటూ ఇండియా కూటమి కొత్త నాటకానికి తెరలేపింది. ఏ సమస్య ఉన్నా.. పార్లమెంట్​కు వచ్చి చర్చించాలి. 

వీధుల్లో ధర్నాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజల మనస్సుల్లో భయాన్ని సృష్టించి మోదీ నాయకత్వాన్ని, జనాల అభి ప్రాయాలను మార్చలేరు. ఈసీకి సమర్పించిన అఫిడవిట్​లో ఓట్ల చోరీ జరిగినట్లు రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు జత చేయలేదు. కాంగ్రెస్ సహా అన్ని అపోజిషన్ పార్టీలు ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతున్నాయి. అది తట్టుకోలేకనే ఈసీ, బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు’’అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నరు: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశ వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతోనే రాహుల్ ఇలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ముక్కలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష.. దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. 

‘‘ఓట్ల చోరీ జరుగుతుంటే.. కర్నాటక, హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ ఎలా గెలిచింది? తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? రాహుల్, ప్రియాంక, అఖిలేశ్ యాదవ్​లు ఎలా గెలిచారు? ఉభయ సభల్లో చర్చల నుంచి ఎవరు పారిపోతున్నారో దేశ ప్రజలంతా చూస్తున్నరు’’అని శివరాజ్​సింగ్ చౌహాన్ విమర్శించారు.

రాహుల్​వి నిరాధార ఆరోపణలు: పీయూష్ గోయల్

లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్​తో పాటు, ఇండియా కూటమి ఎంపీలు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధా రమైనవి అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంట్ టు ఈసీ ర్యాలీతో దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. పార్లమెంట్​లో రాహుల్​తో పాటు అపోజిషన్ పార్టీలేవీ చర్చను కోరుకోవడం లేదన్నారు. చర్చల ద్వారా వచ్చే నిర్మాణాత్మకమైన నిర్ణయాలపై వారికి నమ్మకం లేదని ఈ ర్యాలీతోనే అర్థమైందన్నారు.