సాటి లేని జాతి నిర్మాత అంబేద్కర్

సాటి లేని జాతి నిర్మాత అంబేద్కర్

సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా, భారతదేశపు తొలి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్​ పోషించిన పాత్ర మన జాతి నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర వహించింది. నేడు ఆయన 130వ జయంతిని దేశం మొత్తం గొప్పగా జరుపుకుంటోంది. ప్రతి పౌరుడినీ జాతి నిర్మాణంలో భాగమయ్యేలా కృషి చేసేందుకు అడుగులు వేయించడంలో ఆయన ఆలోచనల్లోని అసాధారణ స్ఫూర్తి, ప్రేరణ ఎంతగానో ఉపయోగపడతాయి. భారత 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా  ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు’ జరుపుకొంటున్న నేపథ్యంలో అంబేద్కర్‌‌ ఆలోచనల్లోని గాంభీర్యాన్ని, జాతి నిర్మాతగా ఆయన పోషించిన పాత్రను, దేశాన్ని గొప్ప శక్తిగా ఎదిగేలా, సామాజికంగా అన్ని వర్గాలను బలోపేతం చేసేలా ఆయన చేపట్టిన చర్యలను పరిపూర్ణంగా ప్రతిఫలింపజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీదా ఉంది.విశిష్ట ఆర్థికవేత్తగా, చురుకైన రాజకీయ నాయకుడిగా, ప్రసిద్ధ న్యాయవాదిగా, గొప్ప జాతీయ చట్టసభ సభ్యుడుగా, అద్భుతమైన పండితుడుగా, విజ్ఞాన ఖని అయిన ఆచార్యుడుగా, మేటి వక్తగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన దేశ నిర్మాణానికి అసాధారణ కృషి చేశారు. మన దేశ కేంద్ర బ్యాంకు అయిన ‘రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా’ భావన ‘హిల్టన్‌‌ యంగ్‌‌’ కమిషన్‌‌ సిఫారసుల నుంచి రూపుదిద్దుకుంది. అయితే, అంబేద్కర్‌‌ తన రచన ‘ది ప్రాబ్లమ్‌‌ ఆఫ్‌‌ రుపీ-ఇట్స్‌‌ ఆరిజిన్‌‌ అండ్‌‌ ఇట్స్‌‌ సొల్యూషన్‌‌’లో ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రాతిపదికనే ఆ సిఫారసులను రూపొందించారు. ఒక్కటేమిటి అన్ని రంగాల్లో మన దేశ వ్యవస్థ ఏ తీరుగా ఉండాలన్న దానిపై గొప్ప ఆలోచనలు చేసిన దార్శనికుడు అంబేద్కర్. కానీ గొప్ప వ్యవస్థ నిర్మాతగా అద్వితీయ మార్గదర్శకత్వం వహించినా చరిత్ర పుటల్లో ఆయనకు ఆ గుర్తింపు దక్కలేదు.

కార్మిక, రైతు పక్షపాతిగా..

రైతులు, కార్మికుల సంక్షేమం కోసం కొట్లాడిన మహనీయుడు అంబేద్కర్. ఏ వేదికనెక్కినా అణగారిన వర్గాల స్వరాన్ని ప్రతిధ్వనించేవారాయన. రౌండ్‌‌ టేబుల్‌‌ కాన్ఫరెన్స్‌‌లో శ్రమజీవుల ప్రతినిధిగా వారి గళాన్ని దీటుగా వినిపించారు. నాడు అత్యంత క్రూరంగా వ్యవహరించే భూస్వాముల ఉక్కు పిడికిళ్ల నుంచి వ్యవసాయ కూలీలకు విముక్తికి ప్రయత్నించారు. బాంబే శాసన సభ పుణె సమావేశాల సందర్భంగా 1937లో కొంకణ్‌‌ ప్రాంతాన భూమి శిస్తు వసూలుకు సంబంధించిన ‘ఖోటీ’ వ్యవస్థ రద్దుకు తీర్మానాన్ని ఒక శాసన సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టారు. అటుపైన 1938లో బాంబేలో కౌన్సిల్‌‌ హాల్‌‌ వరకూ నిర్వహించిన చారిత్రక రైతుకూలీల యాత్ర ఆయనను కర్షక, కార్మిక, భూమి లేని నిరుపేదల పాలిట తిరుగులేని ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. వ్యవసాయ కౌలుదారుల దాస్య విముక్తి కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన తొలి చట్టసభ సభ్యుడు ఆయనే. ‘స్మాల్‌‌ హోల్డింగ్స్‌‌ ఇన్‌‌ ఇండియా అండ్‌‌ దెయిర్‌‌ రెమెడీస్‌‌’ పేరిట 1918లో ఆయన రచించిన వ్యాసం, భారత వ్యవసాయ రంగ సమస్యలకు పారిశ్రామికీకరణను పరిష్కారంగా సూచించింది. నేటి సమకాలీన ఆర్థికాంశాలపై  చర్చల్లోనూ ఇది ప్రధాన అంశంగా నిలుస్తుండడం చూస్తేనే ఆయన దార్శనికత, దూరదృష్టి ఎలా ఉండేదో అర్థమవుతుంది.

కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని నాడే వ్యతిరేకించిన్రు

రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడి హోదాలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం మూల సూత్రాలుగా భారతదేశాన్ని నిష్పాక్షిక సమాజంగా రూపొందించడం కోసం అంబేద్కర్ పటిష్ట చర్యలు తీసుకున్నారు. ‘వయోజనులందరికీ ఓటుహక్కు’పై ఆయన వాదనల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిన మరుక్షణమే మహిళలకూ ఓటు హక్కు ఖాయమైంది. అదే విధంగా ‘హిందూ స్మృతి బిల్లు’ ద్వారా మహిళలకు దత్తత, వారసత్వ ఆస్తి హక్కులు సంక్రమింపజేసి వారి స్థితిగతులను మెరుగుపరచడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమాఖ్య ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా వాటి ఆర్థిక స్థాయి ప్రగతిశీలంగా మెరుగుపడేలా చేశారు. జాతీయ సమగ్రత, సార్వభౌమత్వం బలోపేతానికి బలమైన మద్దతునిస్తూ జమ్ము కాశ్మీర్‌‌కు ప్రత్యేక హోదా యోచనను ప్రణాళిక దశలోనే ఆయన వ్యతిరేకించారు. రాజ్యాంగ ముసాయిదాలో  ఆ స్పెషల్ స్టేటస్‌‌ను చేర్చకుండా జాగ్రత్త పడ్డారు. అంతేగాక జమ్ముకశ్మీర్‌‌ అంశాన్ని హఠాత్తుగా ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలన్న నెహ్రూ విదేశాంగ విధానంపైనా అంబేద్కర్ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. ఆ మేరకు 1951 అక్టోబరు 10న కేంద్ర మంత్రి మండలికి రాజీనామా సమర్పిస్తూ విస్పష్టంగా ప్రకటించారు. అసాధారణ వ్యక్తిత్వం మూర్తీభవించిన డాక్టర్‌‌ బీఆర్ అంబేద్కర్‌‌.. మానవ జీవన సంబంధిత అంశాలన్నింటా తనకుగల ఉజ్వల మేధస్సుతో అన్ని రంగాల్లోనూ దేశానికి మార్గదర్శనం చేశారు. విభిన్న విశ్వాస వ్యవస్థ అయిన బౌద్ధాన్ని అవలంబించిన ఆయన తద్వారా కరుణాభరిత భారతీయ సాంస్కృతిక విలువలను, ఔదార్యాన్ని, సహానుభూతిని ప్రదర్శించారు.

ఆ మహనీయుడి ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్న మోడీ పాలన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజానుకూల, పేదల పక్షపాత, ప్రజా సంక్షేమ విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు డాక్టర్‌‌ బీఆర్ అంబేద్కర్‌‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దిశగా జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, జీవన సౌలభ్యం కల్పనకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోంది. జాతీయ సంస్కర్త అయిన అంబేద్కర్‌‌ వారసత్వాన్ని తగిన రీతిలో నేటి తరాలు గుర్తుంచుకునేలా ఆయన జీవితానికి సంబంధించిన పంచతీర్థాలైన “జన్మభూమి (మౌహౌ), విద్యాభూమి (లండన్‌‌), చైతన్య భూమి (ముంబై), దీక్షాభూమి (నాగ్‌‌పూర్‌‌), మహాపరినిర్వాణ భూమి (సమాధి- ఢిల్లీ)’’కి ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపును ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రతి పౌరుడూ గొప్పగా ఎదిగే సమున్నత భారతదేశం కోసం డాక్టర్‌‌ అంబేద్కర్‌‌ కన్న కలలను నెరవేర్చే దిశగా తిరుగులేని నిబద్ధతతో అనేక చర్యలు చేపడుతోంది. వీటిలో అట్టడుగు, బలహీన వర్గాలకు రుణ లభ్యత పెంచేలా ముద్ర లోన్స్, యువత, సామాన్యులు, అణగారిన వర్గాల్లో నుంచి సైతం ఇండస్ట్రియలిస్ట్‌‌లను తీర్చిదిద్దేలా స్టాండప్‌‌ ఇండియా, స్టార్టప్‌‌ ఇండియా, వెంచర్‌‌ క్యాపిటల్‌‌ ఫండ్‌‌, ప్రతిభాధారిత ఉపకారవేతనం, ప్రజారోగ్య సంరక్షణ కోసం ఆయుష్మాన్‌‌ భారత్‌‌, ప్రధానమంత్రి ఆవాస్‌‌ యోజన, ఉజ్వల యోజన, దీన్‌‌దయాళ్‌‌ ఉపాధ్యాయ్‌‌ గ్రామజ్యోతి యోజన, సౌభాగ్య యోజన వంటివి సహా ప్రసూతి సెలవులు 26 వారాలకు పెంపు, కార్మిక చట్టాల సరళీకరణ వంటి అనేక చర్యలు ప్రభుత్వ చిత్తశుద్ధికి కొన్ని ఉదాహరణలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌‌ 130వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆలోచనల్లోని విశాల దృక్పథాన్ని అర్థం చేసుకుని, వాటిని సాకారం చేయడం ద్వారా ఆయనకు సముచిత నివాళి అర్పిద్దాం. అంతే కాకుండా దేశ నిర్మాణ కృషిలో చిత్తశుద్ధితో నిమగ్నమవుతామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం.

జల వివాదాలపై దూర దృష్టితో..

1942 నుంచి 1946 వరకు వైస్రాయ్‌‌ కార్యనిర్వాహక మండలిలో  కీలకంగా వ్యవహరించిన అంబేద్కర్ జాతీయ ప్రయోజనాలను కాపాడేలా నీరు, విద్యుత్ రంగాల్లో అనేక విధానాలను ఆవిష్కరించారు. ఆయన దూరదృష్టి ఫలితంగానే ‘కేంద్రీయ జలమార్గాలు - సాగునీరు - మార్గనిర్దేశక కమిషన్‌‌’ (సీడబ్ల్యూఐఎన్‌‌సీ) రూపుదిద్దుకొన్నది. అలాగే కేంద్ర జల సంఘం సహా సెంట్రల్‌‌ టెక్నికల్‌‌ పవర్‌‌ బోర్డ్‌‌ ఏర్పడింది. అంతే కాకుండా సమగ్ర జలవనరుల నిర్వహణ లక్ష్యంగా ‘రివర్‌‌ వ్యాలీ అథారిటీ’కి రూపకల్పన చేశారు. దామోదర్‌‌ రివర్‌‌ వ్యాలీ ప్రాజెక్ట్‌‌, సోనే రివర్‌‌ వ్యాలీ ప్రాజెక్ట్‌‌, మహానది (హీరాకుడ్‌‌ ప్రాజెక్ట్‌‌), కోసీ ప్రాజెక్టులతోపాటు చంబల్‌‌ నదిపై ప్రాజెక్టులు, దక్కన్‌‌ ప్రాంతంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ అథారిటీ తోడ్పడింది. అలాగే అంతర్రాష్ట్ర జల వివాద చట్టం-1956, రివర్‌‌ బోర్డ్‌‌ చట్టం -1956 కూడా ఆయన దూరదృష్టికి నిదర్శనాలు.

8 గంటల వర్క్‌‌ టైమ్‌‌ కూడా ఆయన కృషే

బాంబే శాసనసభ సభ్యుడుగా ఉన్నప్పుడు కార్మికుల ‘సమ్మె హక్కు’ను తొలగించే పారిశ్రామిక వివాదాల బిల్లు -1937ను డాక్టర్‌‌ అంబేద్కర్‌‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడుగా ‘సముచిత పని పరిస్థితుల హక్కు’కు బదులుగా ‘కార్మికుల సముచిత జీవన హక్కు’ను ఆయన ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వం కార్మిక విధానం రూపొందించడానికి పునాది వేశారు. ఆయన కృషి ఫలితంగా ప్రగతిశీల కార్మిక సంక్షేమ చర్యలకు రూపకల్పన జరిగి, సామాజిక భద్రత పరిధిలోకి చేర్చేలా చట్టాలు వచ్చాయి. అలాగే కార్మికుల పని సమయాన్ని రోజుకు 8 గంటల చొప్పున ఉండేలా తగ్గించడంలోనూ ఆయన కృషి గణనీయం. అంతే కాకుండా బొగ్గు గనుల వంటి భూగర్భ పనుల్లో మహిళలపై నిషేధాన్ని తొలగించేందుకు పాటుపడ్డారు. ఇక అదనపు పనిగంటలు, వేతనంతో కూడిన సెలవులు, కనీస వేతన నిర్ధారణ - రక్షణ, లింగ భేదంతో నిమిత్తం లేకుండా ‘సమాన పనికి సమాన వేతన’ సూత్రం వంటి వాటిని ఆయన ఆ రోజుల్లోనే ప్రతిపాదించారు. మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు, కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు, కార్మిక సంఘాలకు గుర్తింపు వంటివెన్నో అణగారిన వర్గాల సంక్షేమంపై ఆయన నిబద్ధతకు నిదర్శనాలు. ఇలా అన్ని విధాలా కృషి చేసిన అంబేద్కర్‌‌ కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలను, వారి సీమాంతర పాత్రను, అన్నిరకాల ఉత్పత్తి కారకాలపై నియంత్రణను బోధించే మార్క్సిస్టు విధానాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు.

అర్జున్‌‌ రామ్‌‌ మేఘ్వాల్‌‌,
కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి