ఇతర దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయాలి :  నిరంజన్ రెడ్డి

ఇతర దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయాలి :  నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌/గండిపేట, వెలుగు:  రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చేందుకు రైతులు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికీ మన రాష్ట్రం కొన్ని రకాల విత్తనాలను దిగుమతి చేసుకుంటోందని.. భవిష్యత్ లో దాన్ని అధిగమించాలన్నారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో నిర్వహించిన ‘విత్తన మేళా-2023’ను బుధవారం మంత్రి ప్రారంభించారు. కొందరు రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కావాల్సిన సాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు.

దీంతో ఇప్పుడు తెలంగాణ అంతటా నీళ్లే కనపడుతున్నాయన్నారు. తెలంగాణ వాతావరణం విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైందని.. రైతులు ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో తయారయ్యే విత్తనాలకి ఇతర ప్రాంతాల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. భవిష్యత్ లో తెలంగాణ ప్రపంచానికంతటికీ విత్తనాలను సరఫరా చేసే స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు  చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం వివిధ వంగడాలపై అగ్రికల్చర్ వర్సిటీ రూపొందించిన పాంప్లెంట్లను మంత్రి విడుదల చేశారు. విత్తన మేళాలో అగ్రి వర్సిటీతో ఐసీఏఆర్, జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు, వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు స్టాల్స్  పరిశీలించి విత్తనాలు కొన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర విత్తన సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండ బాలకోటేశ్వర రావు, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్  కె. హనుమంతు, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్  డాక్టర్ ఎం.వెంకటరమణ, ఎక్స్ టెన్షన్ డైరెక్టర్ సుధారాణి, విత్తన డైరెక్టర్ డాక్టర్ పి. జగన్ మోహన్ రావు, సైంటిస్టులు పాల్గొన్నారు.