వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, పశువులు

వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, పశువులు

గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ క్రమంలో జూలై 24న కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో జునాగఢ్ నగరంలో 241 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో నీటి ఎద్దడి, ఆకస్మిక వరదల కారణంగా కార్లు ఒకదానిపై ఒకటి కుప్పలుగా పడిపోయాయి. వాహనాలు, పశువులు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా గుజరాత్‌లో జూలై 22న రెండు జాతీయ రహదారులు, 10 రాష్ట్ర రహదారులు, 300 గ్రామీణ రహదారులు మూసివేశారు. నీరు ప్రవాహం తగ్గిన ప్రదేశాలలో ట్రాఫిక్ పునరుద్ధరించబడిందని అధికారులు ఇప్పటికే తెలిపారు.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)తో సహా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, వర్షం నిలిచిపోయిన ప్రాంతాల్లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే వరదలకు ప్రభావితమైన దాదాపు 3వేల మందిని జునాగఢ్ నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా కొట్టుకుపోయిన, దెబ్బతిన్న వాహనాలను తొలగించేందుకు అధికారులు క్రేన్‌లను ఉపయోగిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు అధికారులు డీవాటరింగ్ పంపులను కూడా వాడుతున్నారు. అధికారులు నగరంలోని పరిశుభ్రతపై దృష్టి సారించగా.. క్లీనింగ్ కోసం 600 మంది సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తున్నారని, మరో 400 మందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని జునాగఢ్ కలెక్టర్ అనిల్ రణవాసీయ తెలిపారు.