మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పశువులను ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్‌‌

మత్తు ఇంజక్షన్లు ఇచ్చి  పశువులను ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్‌‌
  • మహారాష్ట్రలోని నాందేడ్‌‌ కేంద్రంగా దందా

నిర్మల్, వెలుగు : మత్తు ఇంజక్షన్లు ఇస్తూ పశువులకు ఎత్తుకెళ్తున్న ముఠాను నిర్మల్‌‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్‌‌ ఎస్పీ జానకీ షర్మిల గురువారం వెల్లడించారు. నిర్మల్‌‌ జిల్లాలో కొంతకాలంగా ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇస్తూ వాటిని బొలెరో, ఇన్నోవా వాహనాల్లో తరలిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎస్పీ.. నిర్మల్‌‌, భైంసా అడిషనల్‌‌ ఎస్పీలు రాజేశ్‌‌ మీనా, అవినాశ్‌‌కుమార్‌‌ నేతృత్వంలో స్పెషల్‌‌ టీమ్‌‌ను ఏర్పాటు చేశారు. 

రంగంలోకి దిగిన స్పెషల్‌‌ టీమ్‌‌.. ఇటీవల ముథోల్‌‌లో మత్తుమందు ఇచ్చి పశువులను తరలిస్తున్న దృశ్యాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, ఆ ముఠాలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నాందేడ్‌‌కు చెందిన సయ్యద్‌‌ సోహైల్‌‌ 40 మందితో కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. నాందేడ్‌‌లో ప్రత్యేకంగా ఓ గ్యారేజ్‌‌ ఏర్పాటుచేసి, వివిధ జిల్లాలో అపహరించిన పశువులను అక్కడికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. 

అక్కడ పశువులను చంపి.. మాంసాన్ని మహారాష్ట్ర సరిహద్దులో అమ్ముతున్నట్లు తెలుసుకొని అతడిని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు. పోలీసులు తమను వెతుకుతున్నారన్న సమాచారం అందుకున్న ముఠా సభ్యులు రాజస్తాన్‌‌లోని అజ్మీర్‌‌కు పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అజ్మీర్‌‌ వెళ్లి భైంసాకు చెందిన షేక్‌‌ ఉమర్‌‌, ఖలీద్‌‌తో పాటు నాందేడ్‌‌కు చెందిన ముఠా నాయకుడు సయ్యద్‌‌ సోహెల్‌‌, షేక్ జమీర్, షేక్ ముర్తుజ, ముహ్మద్‌‌ నసీర్‌‌, సయ్యద్‌‌ అక్రమ్, సయ్యద్‌‌ షోయబ్‌‌, సయ్యద్ ఫైజాన్‌‌ను అరెస్ట్‌‌ చేసి వారి నుంచి ఇన్నోవా, బొలెరో కార్లు, ఎనిమిది సెల్‌‌ఫోన్లు, రూ.39,280లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. పశువుల చోరీ ముఠాను పట్టుకున్న నిర్మల్‌‌, భైంసా అడిషనల్‌‌ ఎస్పీలతో పాటు సీఐలు మల్లేశ్‌‌, సమ్మయ్య, నైలు, ఎస్సైలు శంకర్, పెర్సిస్, జుబేర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.