విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ గడువు కుదింపు 

 విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ గడువు కుదింపు 
  • కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే వారి కోసం కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ గడువును కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలంటే మొదటి డోస్ వేసుకున్న 84 రోజులు ఆగాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నిబంధన విదేశాలకు వెళ్లాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఒక వైపు విదేశాలు వ్యాక్సిన్ వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తామని షరతులు పెడుతుంటే.. ఇక్కడ మన దగ్గర సెకండ్ డోస్ వేసుకోవడానికి ఏకంగా 84 రోజుల గడువు పెట్టడం ఇబ్బందులకు గురిచేస్తోంది. 
గడువు చాలా పెద్దదిగా ఉందని.. కుదించాలంటూ విదేశీ ప్రయాణాలు చేసే వారు కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య తదితర అవసరాల కోసం విదేశాలకు వెళ్లే వారికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇబ్బందికరంగా మారిందని.. దీని వల్ల వారి జీవితాల్లో భారీఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
మరో వైపు జపాన్ లో ఒలింపిక్స్ జరగనున్న నేపధ్యంలో క్రీడాకారులు కూడా ఇదే రకమైన వినతులు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జపాన్ లో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకోకపోతే ఆదేశంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని కేంద్రం గుర్తించడంతో.. వ్యాక్సినేషన్ ప్రొటోకాల్ నిబంధనల్లో మార్పులు చేసింది. సెకండ్ డోస్ వేసుకోవడానికి గడువును 4 వారాలకు కుదిస్తూ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది.