బీఆర్ఎస్ పాలన ముగిసేనాటికి అప్పులు రూ.3.50 లక్షల కోట్లు

బీఆర్ఎస్ పాలన ముగిసేనాటికి అప్పులు రూ.3.50 లక్షల కోట్లు
  • లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత 2014–15లో తెలంగాణ అప్పులు రూ.69,603.87 కోట్లుగా ఉండగా, 2023–24 నాటికి అవి 5 రెట్లు పెరిగి రూ.3,50,520.39 కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం లోక్‌‌సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024, మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.3,50,520.39 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. అప్పుల్లో అధిక భాగం రూ.3,14,545.68 కోట్లు ఓపెన్‌‌ మార్కెట్‌‌ లోన్స్‌‌ రూపంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.18,057.16 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుంచి తీసుకున్న రుణాలు రూ.13,194.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. 

అంతేగాక వేస్‌‌ అండ్‌‌ మీన్స్‌‌ అడ్వాన్సులు, ఓవర్‌‌ డ్రాఫ్ట్‌‌ రూపంలో రూ.999.62 కోట్లు, ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌కు ప్రత్యేకంగా జారీ చేసిన బాండ్ల రూపంలో రూ.4,723.16 కోట్లు తెలంగాణ తీసుకుందని పేర్కొన్నారు. కాగా... 2014–15లో అప్పులు రూ.69,603.87 కోట్లు, ఆస్తులు రూ.83,142.68 కోట్లు ఉండగా, 2015–16లో అప్పులు రూ.91,999.28 కోట్లు, ఆస్తులు రూ.1,02,936.54 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. 2020–21లో అప్పులు రూ.2,32,173.41 కోట్లు, ఆస్తులు 2,85,836.82 కోట్లకు చేరాయన్నారు. 2023–24లో అప్పులు రూ.3,50,520.39 కోట్లు, ఆస్తులు 4,15,099.69 కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. ఇదే కాలంలో రాష్ట్ర ఆస్తులు రూ.83,142.68 కోట్ల నుంచి రూ.4,15,099.69 కోట్లకు పెరిగినట్లు చెప్పారు.