
రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ ‘రజినీకాంత్ గారు చేసిన పాత్రలో నేను నటించడం అంటే రాఘవేంద్రస్వామి ఇచ్చిన అదృష్టంగా భావించాను.
ఆయన ఆశీర్వాదంతోనే ఇందులో నటించాను. రజినీకాంత్ పాత్రను గొప్పగా చేయగలనా లేదా అని ఆలోచించలేదు. నా పాత్రకు న్యాయం చేస్తే చాలనుకుని, భయపడుతూ నటించాను. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్‌తో నటించడం లక్కీ. చంద్రముఖి పాత్రలో ఆమె బాగా నటించారు. సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అన్నాడు. కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘ తెలుగులో ‘ఏక్ నిరంజన్’ తర్వాత సౌత్‌లో నటించిన సినిమా ఇది.
ఇందులో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. ఫస్ట్ పార్ట్‌లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ఇందులోనూ అన్నీ ఉంటాయి. జ్యోతిక గారి స్ఫూర్తితో ఈ పాత్ర చేశా. డైరెక్టర్ వాసు గారు కొత్తగా నా పాత్రను తీర్చిదిద్దారు’ అని చెప్పింది. 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో ఈ సినిమా తీశానన్నారు దర్శకుడు పి.వాసు. తనకెంతో స్పెషల్ మూవీ అని మహిమా నంబియార్ చెప్పింది.