మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : టీచర్లు మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలకు పెట్టాలని రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ సూచించారు. పాలమూరు జిల్లాలోని షాశాబ్ గుట్ట ప్రభుత్వ పాఠశాల, ఎదిరలోని ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, అర్బన్ ఏనుగొండలోని కేజీవీబీ మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల, తిరుమల హిల్స్ లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అల్పాహారం, భోజనం వడ్డించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వంట గదిలో పరిసరాలను సామగ్రి పరిశీలించారు, కూరగాయలు తాజాగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట సమగ్ర శిక్ష సీఎంవో బాలుయాదవ్, అధికారులు ఉన్నారు.