విద్యార్థి ఆత్మహత్యకు ముఖ్యమంత్రే కారణం..!

 విద్యార్థి ఆత్మహత్యకు ముఖ్యమంత్రే కారణం..!

హైదరాబాద్ : విద్యార్థుల అరెస్టులను ఖండిస్తున్నానన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడంలేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితం బొడ్డ సునీల్ అనే విద్యార్థి పురుగుల మందు తాగగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. విషయం తెలియగానే బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి సునీల్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. ఒక నిరుద్యోగి ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా ..మిగతా నిరుద్యోగుల్ని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇది సీఎం కేసీఆర్ చేసిన హత్యని అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సీఎం గానీ, మంత్రులు గానీ ఎవరూ ఆ పేద కుటుంబానికి బరోసా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ఉద్యోగం లేకుండా బతకలేరని, రాష్ట్రంలో చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు లేవన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ మాయమాటలు చెబుతారని, ఎన్నికలు అయిన తర్వాత మరిచిపోతారన్నారు. ఈ విషయంపై కేసీఆర్ పై కేసు పెట్టాలని సంజయ్ అన్నారు. ఆనాడు అనేకమంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, ఈనాడు సీఎం తన పదవిని కాపాడుకోవడం కోసం అనేకమందిని బలితీసుకుంటున్నారని విమర్శించారు. దయచేసి విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని బండి సంజయ్ సూచించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ పార్థివ దేహాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లాలనేది ఆయన తల్లిదండ్రుల కోరిక అన్నారు. సునీల్ పార్థివ దేహాన్ని అమరవీరుల స్థూపం దగ్గరకు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతించాలని.. సునీల్ తెలంగాణ ఉద్యమకారుడు.. మెరిట్ స్టూడెంట్ అని తెలిపారు.