
హైదరాబాద్, వెలుగు: 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను వారంలోగా గ్రామ పంచాయతీ ఖాతాలకు వెనక్కి ఇవ్వాలని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామని, సర్పంచులందరూ కలిసి ప్రగతి భవన్ తలుపులు బద్ధలు కొడ్తామని హెచ్చరించారు. నిధుల దారి మళ్లింపును ఆర్థిక, సైబర్ నేరంగా పరిగణించి కేంద్రానికి, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల, పంచాయతీ అధికారులకు ఈ నేరంలో భాగముందని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లక్డీకపూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. “గతంలో మైనింగ్ సెస్, సివరేజ్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ ఫండ్స్ గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు వచ్చేవి. పంచాయతీ రాజ్ యాక్ట్ 2018 తీసుకొచ్చిన తర్వాత ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా లోకల్ బాడీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదన్న ఆరోపణలు కేంద్రానికి చేరాయి.
దీంతో గ్రామ పంచాయతీ పేరుతో కేంద్రం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయించింది. కానీ కేంద్రం నుంచి నిధులు రాగానే కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలకు మళ్లించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది” అని సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగతనం చేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకుంటూ కేంద్రం నిధులు ఇస్తలేదని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
నిధుల మళ్లింపులో ఏ రూల్స్ పాటించారు?
‘‘ఊర్లలో మొక్కలు చనిపోయినా, మొక్కలను పశువులు తిన్నా సర్పంచ్ లను కలెక్టర్లు సస్పెండ్ చేస్తున్నారు. రూల్స్ పాటించటం లేదని సర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్న అధికారులు.. నిధుల మళ్లింపులో ఏ రూల్స్ పాటించారు” అని సత్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. “రాష్ట్ర హక్కులు, నిధుల కోసం కేంద్రాన్ని పదే పదే ప్రశ్నించే సీఎం కేసీఆర్.. పంచాయతీల హక్కులను, నిధులను హరిస్తున్నడు. ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు” అని స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ మాట్లాడుతూ.. తాము ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు పూర్తి చేస్తే బిల్లులు రిలీజ్ చేయటం లేదని వాపోయారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఇచ్చి, కేంద్రం విడుదల చేసిన నిధులన్నింటినీ లోకల్ బాడీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చాంబర్ నేతలు అంజనీ ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.