
సదాశివపేట, వెలుగు : పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తన క్యాప్ ఆఫీస్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని ఐబీ వద్ద పట్టణ, మండల పరిధిలోని లబ్ధిదారులకు 49 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
మళ్లీ పొరపాటు చేయొద్దు
సంగారెడ్డి టౌన్/జహీరాబాద్, వెలుగు : గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా బాధ్యతగల వ్యక్తులుగా జీవించాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. సంగారెడ్డి సబ్డివిజన్పరిధిలో120, జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 112 నేర ప్రవృత్తి కలిగి మంచిగా మారిన వారితో శుక్రవారం ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి వారి హిస్టరీ సీట్లను క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై నేరాల జోలికిపోకుండా కష్టపడి పనిచేసుకొని జీవించాలని సూచించారు. వారు ఉండే ప్రాంతాలు, చేసే పనులు, కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అయ్యప్ప స్వాముల ఆందోళనలు
అయ్యప్ప స్వామి పట్టుక, భక్తులపై కోడంగల్ సభలో రాష్ట్ర నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చే యడాన్ని నిరసిస్తూ శుక్రవారం అయ్యప్ప స్వాములు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రోడ్లపై ధర్నా చేశారు. ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ లీడర్లు, ఇతర సంఘాల నేతలు మాట్లాడుతూ హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనుచిత వ్యాఖలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. - వెలుగు, నెట్వర్క్
టెన్త్ లో వంద శాతం రిజల్ట్ సాధించాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో పదవ తరగతిలో 100 శాతం ఫలితాల సాధనకు యజ్ఞంలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ టీచర్స్ యూనియన్ల ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్‌కు పదవ తరగతి పునాది లాంటిదన్నారు. సొంత బిడ్డల గురించి ఎలా ఆలోచిస్తామో.. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో జిల్లాలో వంద శాతం రిజల్ట్స్ రావాలంటే అందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. కంటెంట్ డెవలప్మెంట్ కు సంబంధించి హార్డ్, సాఫ్ట్ కాపీలను సబ్జెక్టు టీచర్లకు ఇస్తామన్నారు. టెస్టులకు సంబంధించిన మార్కుల జాబితాను ఎప్పటికప్పుడు ఎంఈఓ కార్యాలయానికి పంపాలన్నారు. పదవ తరగతి పరీక్షల వరకు అవసరమున్న చోట సబ్జెక్టు టీచర్ల ను ఎవరినైనా తీసుకోవడానికి హెడ్మాస్టర్లకు అనుమతినిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తున్నామని, వారు అవసరమైన సహకారాన్ని అందిస్తారని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు స్నాక్స్ ఇవ్వడానికి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజార్జి షా, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హ్యాట్రిక్ కోసం హార్డ్ వర్క్ చేయండి
కంగ్టి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో ఖేడ్ లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విక్టరీ కోసం పార్టీ ప్రతీ లీడర్ హార్డ్ వర్క్ చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం చాప్టా(బీ)గ్రామానికి చెందిన ప్రకాశ్ మనోహర్ ను మండల యూత్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఖేడ్ ను డెవలప్ చేయకుండా వివక్ష చూపించారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఖేడ్ అభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో మండల సీనియర్ లీడర్లు ఆంజనేయులు సెట్, కృష్ణ ముదిరాజ్,వెంకట్ రెడ్డి,సాయ గౌడ్, సిద్ధు పాటిల్
పాల్గొన్నారు.
నాటేసిన యూపీ కూలీలు!
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మగ కూలీలు శుక్రవారం జోరుగా వరినాట్లు వేస్తుండగా ‘వెలుగు’ క్లిక్‌మనిపించింది. యూపీ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వీరు ఇక్కడి కూలీల కొరతను తీరుస్తున్నారు. 15 మంది రోజుకు 5 ఎకరాల చొప్పున వేగంగా నాట్లు వేస్తూ రైతులతో శభాష్ అనిపించుకుంటున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
మెదక్ పట్టణ మాస్టర్ ప్లాన్ కు కసరత్తు
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రమైన మెదక్‌లో జనాభా పెరగడం, రోజురోజుకూ పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 20 ఏండ్ల వరకు ఇబ్బంది లేకుండా ఉండేలా, పట్టణాభివృద్ధికి దోహదపడేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్టు మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్‌లో మెదక్ పట్టణ కొత్త మాస్టర్ ప్లాన్‌పై స్టేక్‌హోల్డర్స్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత కొత్త మాస్టర్ ప్లాన్‌ను పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపల్‌చైర్మన్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి ఆర్ అండ్ డీ, ఇరిగేషన్ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో మాట్లాడుకొని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూపొందించాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు ఏమైనా సందేహాలు, సలహాలు చేయడానికి 60 రోజుల నుంచి 90రోజుల వరకు సమయం ఉంటుందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్మల్లికార్జున్గౌడ్, మున్సిపల్కమిషనర్ జానకీరామ్‌సాగర్, అధికారులు పాల్గొన్నారు.
గ్రాండ్‌గా మాస్టర్ అథ్లెటిక్ పోటీలు
మెదక్ టౌన్, వెలుగు : మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో 35 నుంచి- 90 మధ్య వయసు కలిగిన పురుషుల, మహిళల అథ్లెటిక్స్ క్రీడలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వంద మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 100, 200 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పందెం, నడక, షాట్ పుట్ నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు మెడల్స్ అందించారు. మొదటి, ద్వితీయ స్థానాలు సాధించినవారిని జనవరి 21, 22 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని మెదక్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మధు, రాజేందర్ తెలిపారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ప్రభు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.