
చిరంజీవి అభిమానులంతా ‘ఆచార్య’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరోవైపు వరుస సినిమాలకు కమిట్ అయిన చిరు, వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. ఇంత బిజీలోనూ ఇతర సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్‌కి అటెండ్ అవుతూ చాలామందిని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ కోసం ఆయన మాటసాయం చేశారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. ఇందుకు థ్యాంక్స్ చెబుతూ కృష్ణవంశీ ట్వీట్ చేశారు. ‘నేనొక నటుణ్ని. నావి కాని జీవితాలకు జీవం పొసే నటుణ్ని, నేను కాని పాత్రల కోసం వెతికే నటుణ్ని, వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని, వేషం తీస్తే ఎవరికీ కాని జీవుణ్ని’ అంటూ సాగే డైలాగ్స్ కి చిరంజీవి వాయిస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. అనసూయ, శివాత్మికా రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. రామ్‌చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ తీసిన కృష్ణవంశీకి ఎప్పటికైనా చిరంజీవితోనూ ఓ సినిమా తీయాలని కోరిక. ప్రస్తుతానికైతే తన సినిమాకి వాయిస్ చెప్పించారు. త్వరలోనే డైరెక్ట్ చేసే చాన్స్ కూడా వస్తుందేమో చూడాలి!