
- రెవెన్యూ శాఖ బలోపేతం
- సీఎం చేతుల మీదుగా నేడు నియాయమక పత్రాలు
- ఇప్పటికే మొదటి విడత ట్రైనింగ్ పూర్తి
- నల్గొండలో 276 , సూర్యాపేట 182, యాదాద్రిలో 153 మందికి నియామకపత్రాలు
నల్గొండ, యాదాద్రి, వెలుగు: రెవెన్యూ డిపార్ట్మెంట్ను బలోపేతం చేయడంతో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 'ధరణి' స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తోంది. గ్రామ పరిపాలన ఆఫీసర్ల(జీపీవో)లను నియమిస్తోంది. వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నియామక పత్రాలు అందించనున్నారు. కొత్తగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నారు. వీరి నియామకంతో భూ సమస్యల పరిష్కారంలో వేగం పుంజుకోనుంది.
గ్రామానికో జీపీవో, లైసెన్స్ డ్ సర్వేయర్
గత ప్రభుత్వం ధరణిని అమలులోకి తేవడంతోపాటు, వీఆర్వో వ్యవస్థను పూర్తిగా తొలగించింది. దీంతో గ్రామాల్లో రెవెన్యూ పాలన వ్యవస్థ లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి రద్దు చేసి దాని స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ బలోపేతం చేయడానికి ప్రతీ రెవెన్యూ గ్రామానికి పాలన ఆఫీసర్ (వీఆర్‌వో స్థాయి)ను నియమించనుంది. అప్లయ్చేసుకున్న గత వీఆర్‌వోలు, వీఆర్‌ఏకు ఎగ్జామ్ నిర్వహించింది. సర్వేయర్ల కొరత తీర్చేలా ప్రైవేట్ సర్వేయర్లను నియమించడానికి వీలుగా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అర్హత పొందిన వారికి ట్రైనింగ్ఇచ్చి బాధ్యతలు అప్పగించనుంది.
నేడు నియామక పత్రాలు అందుకొనున్న జీపీవోలు
అర్హత పొందిన వీఆర్వో, వీఆర్ఏలకు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నియామక పత్రాలు అందించనున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 276 మందికి, సూర్యాపేటకు చెందిన 182, యాదాద్రి జిల్లాకు చెందిన 153 మందికి నియామక పత్రాలు అందించనున్నారు. నియామక పత్రాలు అందుకున్న వీరికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం, పోస్టింగ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోస్టింగ్ ఇస్తారు.
సర్వేయర్లకు కొనసాగుతున్న ట్రైనింగ్
జిల్లాలో సర్వేయర్లకు మొదటి విడత ట్రైనింగ్ పూర్తి కాగా.. రెండో విడత ట్రైనింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో 819 మంది ప్రైవేట్ సర్వేయర్లు దరఖాస్తు చేసుకుంటే వీరిలో 375 మంది రిపోర్ట్ చేశారు. ట్రైనింగ్ అనంతరం టెస్ట్ నిర్వహించగా 75 మంది టెస్టులో పాసయ్యారు. మరో 300 మంది సర్వేయర్లకు శిక్షణ అందిస్తున్నారు. రెండో విడతలో 410 మంది సర్వేయర్లు దరఖాస్తు చేసుకోగా వీరిలో 360 మంది రిపోర్ట్ చేయగా 50 మంది సర్వేయర్లు రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేసిన వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో 280 మంది అప్లై చేసుకోగా వీరిలో 197 మంది రిపోర్ట్ చేశారు. వీరికి టెస్ట్ నిర్వహించగా 80 మంది పాస్ అయ్యారు. రెండో విడతలో 258మంది అప్లై చేసుకోగా 238 మంది రిపోర్ట్ చేశారు. వీరికి ట్రైనింగ్ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లాలో 140 మంది ప్రైవేట్ సర్వేయర్లకు ఎగ్జామ్ నిర్వహించగా 41 మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన 99 మందికి ఈ నెల13న మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు