
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.13,378.17 కోట్లుగా ఖరారు చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పతి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో క్రాప్ లోన్లు, ఎస్‌హెచ్‌జీ లోన్లు, రికవరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ సూచించారు. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,627.04 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు.
2025–26 వార్షిక రుణ ప్రణాళికను రూ.13378.17 కోట్లతో ఆవిష్కరించారు. వ్యవసాయానికి రూ.5,157.33 కోట్లు, ఎంఎస్‌ఎంఈ కింద రూ.3,239.40 కోట్లు, విద్యా రుణాలు రూ.49.50 కోట్లు, హౌసింగ్ రూ.310.50 కోట్లు, ఎగుమతి రంగాలకు రూ.6.40 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలు రూ.20.32 కోట్లు, పునరుత్పాదక ఇంధనం రూ.50.97 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగానికి రూ.255 కోట్లు, ఎస్ హెచ్‌జీ లోన్లు రూ. 875కోట్లు, ఇతర రంగాలకు గాను రూ.3,413.75 కోట్ల రుణాలుగా అందజేయాలని బ్యాంకర్లకు సూచించారు.
అనంతరం సిటీలోని బీసీ గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ ఇటీవల డెహ్రాడూన్‌లోజరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సిరిచందన(ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ)ను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ఎంపీడీవోలు, ఇతర అధికారులతో రివ్యూ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ ఆఫీసర్ సాయితేజరెడ్డి, డీడీఎం ఎస్.జయప్రకాశ్, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, చీఫ్‌మేనేజర్ రామచంద్రుడు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, డీవైఎస్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్, వెలుగు: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతారని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశువికాస కేంద్రంలో 20మంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌లో గతనెల 12నుంచి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఆటోలను పైసా ఖర్చు లేకుండా నడుపుకుంటూ.. రోజూవారీ ఆదాయం పొందవచ్చునని తెలిపారు.