
- కలెక్టర్ ప్రావీణ్య
పుల్కల్, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్రంలో పర్యటించారు. జడ్పీ హైస్కూల్, బస్తి దవాఖాన, అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే అన్నారు. ఆస్పత్రిలో మందుల లభ్యత, ఓపీ రికార్డును పరిశీలించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జీపీ సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, బరువు వివరాలను తెలుసుకున్నారు. పౌష్టికాహార నాణ్యతను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ అనుదీప్, ఆర్ఐ ప్రమోద్, ఎంపీడీవో శంకర్, డాక్టర్లు సాయికిరణ్, కవిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
30లోపు అభ్యంతరాలు తెలియజేయాలి..
సంగారెడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీపీవో సాయి బాబాతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఓటరు జాబితాలు సక్రమంగా సిద్ధం చేయాలన్నారు. ఓటరు జాబితాలపై వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పోలింగ్ స్టేషన్లు, డ్రాఫ్ట్ లిస్ట్, ఎలక్ట్రోల్ రూల్స్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఓటరు జాబితాపై పొరపాట్లపై ఉంటే ఎంపీడీవోలకు ఈ నెల 30లోపు దరఖాస్తులు అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఈ సమీక్షలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాషా, తారాసింగ్, మాణిక్ రావు, అడివయ్యా, కృష్ణ, యాకూబ్ అలీ, బందయ్యా, డేవిడ్ పాల్గొన్నారు.