ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం ఆయన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్లు, మందుల నిల్వల గదిని తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్యులు, నర్సులు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవి దృష్ట్యా దవాఖానాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సాధారణ ప్రసవాలను మరింతగా పెంచాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

వేగంగా ధాన్యం తరలించాలి

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు  తరలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. హవేలి ఘన్​పూర్ మండలం కుచన్ పల్లి గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రిజిస్టర్లు పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.  రైతులతో మాట్లాడడంతో పాటు కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సేవలు, ఇతర సౌకర్యాలు, సేవలపై ఆరా తీశారు. ప్రధానంగా రైతులకు అందుతున్న మద్దతుపై అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన వడ్లు  తడవకుండా టార్ఫాలిన్ కవర్లని కప్పాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.