
- రేషన్ కార్డుల పంపిణీలో కలెక్టర్ రాహుల్ రాజ్
కౌడిపల్లి/కొల్చారం, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, కొల్చారంలోని రైతు వేదికలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డితో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9,960 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 34 వేల కుటుంబాల పేర్లు రేషన్ కార్డులో నమోదు చేశామని చెప్పారు.
రేషన్ కార్డు రానివారు ఆందోళన చెందవద్దని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. 500 గ్యాస్ సబ్సిడీ కింద జిల్లాలో లక్ష 26 వేల మందికి రూ.4.68 లక్షల సిలిండర్లు పంపిణీ చేయగా రూ.13 కోట్లు సబ్సిడీ అందిందన్నారు. జిల్లాలో 10,574 గ్రూపులకు రూ.13 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. గత సంవత్సరం ఇందిరా శక్తి పథకం కింద జిల్లాకు రూ. 100 కోట్లు లోన్లు ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కౌడిపల్లి మండలానికి 615 కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, రేషన్ కార్డు అనేది ప్రతి పౌరునికి ఒక గుర్తింపు అన్నారు. .
గ్యాస్ సబ్సిడీ మగవారి పేరు మీద ఉంటే రావడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సుహాసిని రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోవడంతో ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారన్న ఆలోచనతో ప్రభుత్వం గ్రామీణ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి నిత్యానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీహరి పాల్గొన్నారు.