రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు పెస్టిసైడ్ షాపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు పెస్టిసైడ్ షాపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలోని 8 మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో పెస్టిసైడ్, విత్తన విక్రయ కేంద్రాల నిర్వహణకు లైసెన్సులు ఇచ్చినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌‌లో మహిళా సంఘాల బాధ్యులకు లైసెన్స్‌‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ఈ లైసెన్స్‌‌లు ఇస్తున్నట్లు చెప్పారు. వేములవాడలోని శ్రీ ధనలక్ష్మి మండల సమాఖ్య సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ముస్తాబాద్‌‌లోని గాయత్రి గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్, బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్, వేములవాడ శివరామ్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్, కోనరావుపేట విశ్వదర్శిని గ్రామ సమాఖ్య సంఘం, గంభీరావుపేట విజయలక్ష్మి గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్, ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట భాగ్యశ్రీ గ్రామైక్య సంఘం, తంగళ్ళపల్లి వినాయక పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్.. షాపులకు లైసెన్సులు అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. డీఆర్డీఓ శేషాద్రి, డీఏవో అఫ్జలి బేగం, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.