
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,చివ్వెంల, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలోనే నిర్మించుకోవాలని తెలిపారు.
స్థానిక మేస్త్రీలతో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, ముందుగా అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పారు. అనంతరం గుంపుల తిరుమలగిరిలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో ప్రకాశ్ రావు, ఎంఈవో కళారాణి, హెడ్మాస్టర్ బి.శైలజ, హౌసింగ్ ఏఈ ప్రేమలత ఉన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు -
జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో డీఏవో శ్రీధర్ రెడ్డి, డీసీవో పద్మతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, కో–ఆపరేటివ్ డివిజనల్ అధికారులతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రాబోవు 2, 3 రోజుల్లో 1000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని తెలిపారు.