వనపర్తి , వెలుగు: జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం సరళాసాగర్, రామన్ పాడ్ ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు. ప్రమాదకర కాజ్ వేలు, కాల్వలు ఎక్కడెక్కడ పొంగిపోర్లుతున్నాయని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బందిని పెట్టాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, అలాంటి వాటిని గుర్తించి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చూడాలన్నారు.
యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి
జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్ ఎరువుల నిల్వలున్నాయని తెలిపారు. ప్రతీ వారం యూరియా వస్తోందని, రైతులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనొద్దని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఫెర్టిలైజర్ షాపులను, సొసైటీ గోదాంలను తనిఖీ చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ పై టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యా నాయక్, యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఏవో ఆంజనేయులు గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీవో ప్రసాద్ రావు, డీఎంవో స్వరణ్ సింగ్, ఆర్టీవో మానస, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ జగన్మోహన్, తహసీల్దార్లు మోహన్, శివకుమార్ తదితరులున్నారు.
అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం వర్షాలు, సహాయక చర్యలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ, మండల స్థాయి అధికారులు సంబంధిత హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదేశించారు.
శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉన్న వారిని దగ్గరలోని సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. కాజ్ వేలు, రోడ్లుపైకి వరద నీరు వచ్చే చోట ట్రాఫిక్ ను మళ్లించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జడ్పీ సీఈవో వెంకటరెడ్డి, డీఆర్డీవో నరసింహులు, డీపీవో పార్థసారథి, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్ పాల్గొన్నారు.
