V6 News

సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లు.. ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లు.. ఒకరు మృతి

సూర్యాపేట, వెలుగు:  పాత కక్షలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్ల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోగా.. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... లింగంపల్లి గ్రామానికి చెందిన ఉప్పల పాపయ్య, ఉప్పల మల్లయ్య (55) అన్నదమ్ముల పిల్లలు. మల్లయ్య బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో కొనసాగుతుండగా.. పాపయ్య కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో ఉన్నాడు. కొన్నేండ్ల కింద పాపయ్య సర్పంచ్‌‌‌‌గా పనిచేయగా.. మల్లయ్య వార్డు సభ్యుడిగా పనిచేశాడు. 2018లో పాపయ్య కోడలు రజిత, మల్లయ్య కోడలు శైలజ వార్డు స్థానానికి పోటీ చేయగా.. శైలజ గెలిచింది. ఇప్పుడు మరోసారి నాలుగో వార్డు స్థానానికి రజిత, శైలజ బరిలో నిలిచారు.

 రాజకీయంగా పోటీ పడుతుండడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి మల్లయ్య తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతుండగా... కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. పరస్పరం కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో మల్లయ్య సహా 20 మందికి గాయాలు అయ్యాయి. మల్లయ్యను ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం మొదట సూర్యాపేటకు, అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌కు తరలించగా.. అప్పటికే చనిపోయాడు. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేటలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేసి మల్లయ్య అంత్యక్రియలు జరిగేలా చేశారు.

ఎనిమిది మంది అరెస్ట్‌‌‌‌

లింగంపల్లిలో మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ రవీందర్‌‌‌‌రెడ్డి తెలిపారు. బుధవారం నూతనకల్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కక్షల కారణంగా గొడవ జరిగినట్లు తెలిపారు. మల్లయ్య కోడలు శైలజ నాలుగో వార్డు మెంబర్‌‌‌‌గా పోటీ చేస్తుండగా.. ఆమెకు వ్యతిరేకంగా బరిలో ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలో ఉప్పుల సతీశ్‌‌‌‌, కొరవి గంగయ్య, వీరబోయిన సతీశ్‌‌‌‌, ఉప్పుల గంగయ్య, ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యను అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు అడిషనల్‌‌‌‌ ఎస్పీ వెల్లడించారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌‌‌‌ : మాజీమంత్రి జగదీశ్‌‌‌‌రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. లింగంపల్లిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య డెడ్‌‌‌‌బాడీని ఆయన సందర్శించి, పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఓటమి భయంతోనే కాంగ్రెస్‌‌‌‌ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌‌‌‌.. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ, కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు. మల్లయ్య ఫ్యామిలీని త్వరలోనే కేటీఆర్‌‌‌‌ పరామర్శిస్తారని చెప్పారు. ఆయన వెంట మాజీఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌‌‌‌ ఉన్నారు.

ఉద్రిక్తతకు దారి తీసిన ఇంటింటి ప్రచారం

జడ్చర్ల, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామంలో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్ఎస్‌‌‌‌ క్యాండిడేట్ల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మద్దతుతో హేమలత, కాంగ్రెస్‌‌‌‌ మద్దతుతో నిర్మల బాలస్వామి సర్పంచ్‌‌‌‌ బరిలో నిలిచారు. బుధవారం ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల మధ్య గొడవ జరగడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.