
- కవిత వ్యవహారంతో కాంగ్రెస్కు సంబంధం లేదు: ఎమ్మెల్యే బొజ్జు
ఖానాపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని, కేంద్ర ప్రభుత్వం లోతుగా విచారించి మాజీ సీఎం కేసీఆర్ను జైలుకు పంపాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్వయాన కేసీఆర్ కూతురు కవిత బహిరంగంగా మీడియా ముందు చెప్పిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని, అందుకే కవిత బీఆర్ఎస్తోపాటు కుటుంబసభ్యులపై తిరుగుబాటు జెండా ఎగురవేసిందన్నారు.
ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి కేసు విషయం కోర్టు పరిధిలో ఉందని బొజ్జు పటేల్అన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఇటీవల భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఉత్తమ పాలన కొనసాగిస్తోందన్నారు. సమావేశంలో ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యం, రాజేందర్, నాయకులు శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.