ఆ రూ.350 కోట్లు.. నా ఒక్కడివే కాదు : బాంబ్ పేల్చిన ఎంపీ

ఆ రూ.350 కోట్లు.. నా ఒక్కడివే కాదు : బాంబ్ పేల్చిన ఎంపీ

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నాలుగు రోజుల పాటు డబ్బును లెక్కించగా.. దాదాపు రూ.350కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. ఈ క్రమంలో తాజాగా ఆయన తన మౌనాన్ని వీడి, రికవరీ చేసిన డబ్బు తనది కాదని పేర్కొన్నారు. కేంద్ర ఏజెన్సీ స్వాధీనం చేసుకున్న డబ్బు తన మద్యం కంపెనీలకు సంబంధించినదని, దీంతో కాంగ్రెస్ లేదా మరే ఇతర రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

I-T సోదాల్లో బయటపడ్డ దాదాపు రూ. 350 కోట్లకు పైగా రికవరీపై మొదటిసారి స్పందించిన ధీరజ్ సాహూ.. ఆ డబ్బు తన మద్యం సంస్థలకు, మద్యం విక్రయాల ప్రక్రియకు సంబంధించినదని తెలిపారు. డబ్బు అంతా తనది కాదని, అది తన కుటుంబం, ఇతర సంబంధిత సంస్థలకు చెందినదని, ప్రతిదానికీ లెక్క చెప్తారని అన్నారాయన.

ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, కాంగ్రెస్ శాసనసభ్యుడు, అతని కుటుంబానికి చెందిన అనుబంధ సంస్థలపై సోదాలు నిర్వహించిన తర్వాత, డిసెంబర్ 15న I-T డిపార్ట్‌మెంట్ తన దాడులను ముగించింది. ఈ దాడులు వరుసగా 10 రోజుల పాటు కొనసాగాయి. ఈ దాడుల్లో దాదాపు రూ. 350 కోట్ల నగదును జప్తు చేసి.. దీన్ని భారతదేశంలో జప్తు చేసిన అత్యధిక నగదుగా తెలిపింది..