కర్నాటకలో ప్రజా విజయం..నిజాయతీపరులకే పట్టం కట్టిన ప్రజలు

కర్నాటకలో ప్రజా విజయం..నిజాయతీపరులకే పట్టం కట్టిన ప్రజలు

భారత ప్రజాస్వామ్యంలో అరుదైన ప్రజావిజయంగా కర్నాటకలో కాంగ్రెస్​ గెలుపును చూడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీకి ఈ ఓటమి గుణపాఠం. స్వయంగా ప్రధాన మంత్రే ప్రచారక్​గా పనిచేసినా విజయం దరిదాపుల్లో లేకపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం. బజరంగ్​దళ్, కేరళ స్టోరీ లాంటి వివాదాంశాలు తెరమీదకు తెచ్చినా లాభం లేకుండా పోయింది.  కాంగ్రెస్​ముక్త్ భారత్ ​నినాదంతో ముం దుకు వెళ్లి దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు తేవాలని బీజేపీ చూసింది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఉన్న ఒక్క రాష్ట్రం కోల్పోయిన తర్వాతనైనా ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటుందా లేదా? అనే విషయం పక్కనబెడితే.. రాజ్యాంగ రాజకీయాలు చేయాల్సిన కంపల్సన్​ ఇప్పుడు ఏర్పడింది.

కేసీఆర్ ​ఎత్తుగడలు చిత్తు?

కర్నాటక కాంగ్రెస్​ విజయం దేశంలోని కాంగ్రెస్​నాయకులకు, కార్యకర్తలకు కొత్త ఊపునిచ్చింది. ఒక దశలో బీజేపీకి సహకరించడానికి బీఆర్ఎస్​తన సహజ మిత్రుడు, బీజేపీ రహస్య మిత్రుడు ఎంఐఎంతో కలిపి జత కట్టించి ఆర్థిక సహకారం అందించారు. కాంగ్రెస్​కర్నాటకలో గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందనే ఉద్దేశంతో మొదట్లో కాంగ్రెస్​ను చీల్చేందుకు రూ.500 కోట్ల ఆఫర్​తో ప్రయత్నించి భంగపడ్డది బీఆర్ఎస్. అలా వీలు కానప్పుడు బీజేపీకి జేడీఎస్​మద్దతివ్వడాన్ని గమనించాక ఎంఐఎంను జేడీఎస్​తో కలిపి కాంగ్రెస్ కు నష్టం చేసే ప్రయత్నం చేసింది. దాని వల్ల జేడీఎస్​దురుద్దేశాన్ని కర్నాటక ప్రజలు గమనించారు. వీరి ఎత్తుగడలు చిత్తు చేస్తూ ఇక్కడ 35 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్​కు పూర్తి విజయాన్ని కట్టబెట్టారు.

తెలంగాణలో ప్రభావం

కర్నాటక విజయం ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్​కు కలిసి వస్తుందని చెప్పక తప్పదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకి సానుకూలత పెరుగుతున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో విశ్వాసం ఉన్నది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, పార్టీ సీనియర్​ నాయకుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రల వల్ల వాక్యుమ్​ ఫిల్​అవుతున్నది. దానికి తోడు రాహుల్​గాంధీ భారత్​జోడో యాత్ర ప్రభావం కూడా అంతర్గతంగా బలంగా పనిచేస్తున్నది. క్రమంగా కాంగ్రెస్ ​నాయకత్వంపై తెలంగాణ సమాజానికి నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్​కు రావాలనుకునే వారు త్వరగా రావడానికి ప్రయత్నిస్తారు. కాంగ్రెస్​ పార్టీని వీడాలనుకునేవారు బయటకు వెళ్లడానికి వెనకాడతారు. కర్నాటక విజయంతో తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం.

ప్రజాస్వామ్య రాజకీయాలు కావాలి

విజయాలు కరువైన వేళ.. గెలిచిన ప్రభుత్వాలను కూల్చుతున్న బీజేపీకి కర్నాటక ఎన్నికల ఫలితం చెక్​పెట్టినట్లయింది. గుజరాత్​లో ఓటమి, హిమాచల్​లో గెలుపును మసిపూసింది కానీ, కర్నాటక కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయింది. ఇప్పుడు ఈ ఫలితం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. రెండోసారి అటు కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో వాళ్లిద్దరే పరస్పరం కొట్లాడుకోవడం కూడా రాష్ట్ర ప్రజలకు నచ్చట్లేదు.​ అన్ని చట్టాలకు ఇద్దరు సహకరించుకుంటారు. మళ్లీ ఆయా అంశాలపై వాళ్లే కలహించుకుంటారు. ఈ రెండు పార్టీలు అంతిమంగా ప్రతిపక్ష పార్టీలను మట్టుపెట్టే కుట్ర చేస్తున్నాయి. అది ఇంక ఎన్నో రోజులు తెలంగాణలో జరగదు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్​కు కలిసివస్తుంది. కులం, మతం, ప్రాంతం సమీకరణలు.. రాజ్యాంగ రాజకీయాలను శాసిస్తున్న ఈ రోజుల్లో కాంగ్రెస్​ మాత్రమే ప్రజాస్వామ్య రాజకీయాలను కాపాడుతుందని ప్రజలు భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలైన రాజ్యాంగబద్ధ సంస్థలను విధ్వంసం చేసి రాజరికాన్ని తలపించేలా చేస్తున్న బీజేపీని కర్నాటక ప్రజలు నిలువరించారు. ఇదే కాదు ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్​లాంటి పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాయి. అదే బీజేపీ ఎజెండాగా కూడా ఉన్నది. ఈ దేశంలో కొన్ని పార్టీలు ప్రాంతాన్ని వాడుకొని రాజకీయాలు చేస్తున్నాయి. జేడీఎస్​లాంటి ఉప ప్రాంతీయ పార్టీలు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు మతాన్ని వాడుకొని పాలిటిక్స్​ చేస్తే, బీజేపీ, ఎంఐఎం మాదిరిగా మత రాజకీయాలు చేయలేని పార్టీలు వాటి రాజకీయాల వల్ల నష్టపోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి పార్టీల తీరు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

నిజాయతీపరులకే పట్టం కట్టిన ప్రజలు

విద్వేషాలు రెచ్చగొట్టి దేశసమగ్రతకు విఘాతం కల్పించే కుట్రలు జరుగుతున్నాయి. కాంగ్రెస్​ పార్టీ సౌభ్రాతృత్వాన్ని,సార్వభౌమత్వాన్ని కాపాడే సర్వమత సమానత్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నది. 80 శాతం హిందువులు ఉన్న కర్నాటకలో హిందూ సెక్యులరిస్టులే కాంగ్రెస్​కు అప్రతిహత విజయం కట్టబెట్టి అధికారాన్ని ఇచ్చారు. సెక్యులర్​గా లేకున్నా సరే ‘సూడే హిందువు’ ఎజెండాను బీజేపీ మానుకోవాలి. ఏది ఏమైనా కర్నాటక విజయం కాంగ్రెస్​కు అవసరమైన విజయం. బీజేపీకి ఈ ఓటమి లేకపోతే దేశంలోని విశృంఖలమైన రాజకీయాలకు తెగబడేది. అన్నింటికీ ఒకే ఫార్ములా సరిపోదని తేల్చి చెప్పిన రాజకీయం చూశాం. ఎంత ఖర్చు చేసినా నిజాయతీగా పని చేసే వారికే ప్రజలు పట్టం కడతారనే విషయం దేశంలో మరోసారి రుజువైంది.
–డా. అద్దంకి దయాకర్,టీపీసీసీ జనరల్​ సెక్రటరీ