
వెంకటాపురం, వెలుగు: ఇసుక లారీల వల్ల శిథిలమైన రోడ్లను నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేశారు. మండల పరిధిలోని రామచంద్రాపురం అలుబాక, ఎదిర, వెంకటాపురం గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల కార్యదర్శి జ్ఞానం వాసు మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏజెన్సీ గ్రామాలను ఇసుక ర్యాంపుల పేరుతో దోపిడీ చేసిందని మండిపడ్డారు. అభివృద్ధిని మర్చిందని, భద్రాచలం – వాజేడు ప్రధాన రహదారి ఎదిరగుట్టల నుంచి వెంకటాపురం వరకు 40 కిలోమీటర్ల రహదారి అధ్వానమైందన్నారు.
రోడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉండడంతో బస్సులు తిరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడానికి బుధవారం ఏజెన్సీ గ్రామాల్లో బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం జిల్లా నాయకులు, కొప్పుల రఘుపతి, కుమ్మరి శీను, వంక రాములు, చిట్టెం ఆదినారాయణ పాల్గొన్నారు.