కరెంట్​ కార్లకు మస్తు క్రేజ్​

కరెంట్​ కార్లకు మస్తు క్రేజ్​

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది సాధారణ కార్ల అమ్మకాలు 6 శాతం తగ్గినప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మాత్రం 41 శాతం పెరిగాయని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ ఆర్గనైజేషన్ (ఐఇఏ)  తాజా రిపోర్టు తెలిపింది. మహమ్మారి వల్ల స్లోడౌన్ ఉన్నప్పటికీ ఈవీలకు డిమాండ్ తగ్గకపోవడం విశేషం. 2020 లో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 4.6శాతం వరకు ఉంది. రికార్డుస్థాయిలో 30 లక్షల ఎలక్ట్రిక్ కార్లనుకొనుగోలు చేయడానికి కస్టమర్లు 120 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ.  ఎలక్ట్రిక్ కార్ల  వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం దాదాపు  14 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10 లక్షల కోట్లు)  ఖర్చు చేసింది. అయితే ఈవీలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు 2015 నుంచి 2020 వరకు 20 శాతం నుంచి 10శాతానికి పడిపోయింది. "ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుదలకు ప్రభుత్వ రాయితీలు కీలకమే అయినా, కస్టమర్లు కూడా ఈవీలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టే అమ్మకాలు పెరుగుతున్నాయి”అని  ఐఈఏ రిపోర్టు తెలిపింది.

డిమాండ్ పెరగడంతో కంపెనీలు పోయిన ఏడాది 370 ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను లాంచ్ చేశాయి.  గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం పెరుగుదల రికార్డయింది.  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కోటికిపైగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయని అంచనా.   ఎలక్ట్రిక్ వ్యాన్లు, భారీ ట్రక్కులు,  బస్సులు కూడా కోటి వరకు ఉన్నాయి. చైనా గత ఏడాది తొలిసారిగా ఈవీల అమ్మకాల్లో యూరప్ చైనాను అధిగమించి గ్లోబల్ ఈవీ మార్కెట్‌‌‌‌గా ఎదిగింది. యూరప్ దేశాల్లో ఈవీల రిజిస్ట్రేషన్లు రెట్టింపై 14 లక్షలకు చేరుకున్నాయి.  చైనాలో ఇవి 9శాతం పెరిగి 12 లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుత రిజిస్ట్రేషన్లను గమనిస్తే 2030 నాటికి  ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, వ్యాన్లు, హెవీ ట్రక్కులు,  బస్సుల సంఖ్య 1.45 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. సాధారణ వెహికల్స్‌‌‌‌లో వీటి వాటా ఏడు శాతానికి పెరుగుతుంది. అయితే వీటిలో ఎలక్ట్రిక్ టూవీలర్లను కలపలేదు.  "ప్రస్తుతం అమ్మకాలు బాగానే ఉన్నాయి కానీ పర్యావరణాన్ని కాపాడటానికి పెట్టుకున్న టార్గెట్లను చేరుకోవాలంటే అమ్మకాలు ఇంకా పెరగాలి. ఇందుకోసం ప్రభుత్వం మరిన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెంచాలి. బ్యాటరీ తయారీ ప్లాంట్లు ఏర్పాటు కావాలి. అంతటా చార్జింగ్ స్టేషన్లు ఉండాలి” అని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతి బిరోల్ అన్నారు.

ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌కు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2020లో అమ్ముడయిన మొత్తం కార్లలో వీటి వాటా 4.6 శాతం ఉంది.  కస్టమర్లు రికార్డుస్థాయిలో 30 లక్షల ఎలక్ట్రిక్ కార్లను కొన్నారు. వీటి విలువ 120 బిలియన్ డాలర్లు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ. గత ఏడాది గ్లోబల్ యావరేజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ) ధర 40 వేల డాలర్లు (దాదాపు రూ.30 లక్షలు) కాగా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (పీహెచ్ఈవీ) రేటు 50 వేల డాలర్ల (దాదాపు రూ.37 లక్షలు)  వరకు ఉంది.