ఓ పక్క వరద.. మరో పక్క మొసళ్లు.. ఏకంగా ఇంట్లోకే వస్తున్నయ్

ఓ పక్క వరద.. మరో పక్క మొసళ్లు.. ఏకంగా ఇంట్లోకే వస్తున్నయ్

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని లక్సర్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటివరకు వరద భయాన్ని ఎదుర్కోగా.. ఇప్పుడు వారిలో మరో కొత్త గుబులు మొదలైంది. గంగా, దాని ఉపనదుల ద్వారా వచ్చిన వరదలు వచ్చి నివాస ప్రాంతాలలోకి వస్తుండగా.. ఇప్పుడు వరదతో పాటు మొసళ్ళు కూడా ప్రవేశిస్తుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

గంగానది, దాని ఉపనదులైన బాన్ గంగా, సోనాలి నదుల వరద నీటితో పాటు వస్తోన్న సరీసృపాలను అటవీశాఖ పట్టుకుని తిరిగి నదుల్లోకి వదులుతోంది. ఇప్పటివరకు ప్రధాన నదుల ద్వారా వస్తోన్న దాదాపు డజను మొసళ్లను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లక్సర్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లో మొసళ్లను పట్టుకోవడానికి 25 మందితో కూడిన బృందాన్ని ఇప్పటికే అటవీశాఖ ఏర్పాటు చేసింది. వీరంతా 24 గంటలూ అందుబాటులో ఉండనున్నట్టు కూడా తెలిపింది.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, గంగానది నీటి మట్టం పెరిగి, లక్సర్, ఖాన్‌పూర్ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి, సోనాలి నదిపై ఆనకట్ట తెగిపోవడంతో వరద పరిస్థితి మరింత దిగజారింది. గత వారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత గ్రామాలను పరిశీలించారు. జూలై 17న లక్సార్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టగా, 18న కురిసిన భారీ వర్షాలకు నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఇక ఖాన్‌పూర్‌లోని ఖెడికలన్ గ్రామంలోని ఓ ఇంటి బాత్‌రూమ్‌లో పెద్ద మొసలి ఆశ్రయం పొందిందని, అటవీ శాఖ బృందం దాన్ని పట్టుకుని తిరిగి నదిలోకి వదిలిందని స్థానికులు తెలిపారు. బాన్ గంగా, సోనాలి నదులలో గణనీయమైన సంఖ్యలో మొసళ్ళు ఉన్నాయని, అవి వరద నీటితో పాటు జనావాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయని హరిద్వార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ చెబుతున్నారు.