నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ..పర్యాటకుల రద్దీ

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ..పర్యాటకుల రద్దీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహాలతో సాగర్ జలాశయం నిండుకుండలా మారి, పరిసర ప్రాంతాల్లో అపూర్వ సోయగం అలరారుతోంది. ఈ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. డ్యాం పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రాజెక్టుకు 77వేల494 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అదే పరిమాణంలో 77వేల494 క్యూసెక్కుల నీటిని అవుట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. అధికారులు 4 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి, 32వేల400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందకు తరలిస్తున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం కూడా అదే స్థాయిలో నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 శాతం నీరు నిండి ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది.

పర్యాటకుల హంగామా

డ్యాం గేట్ల నుంచి ఉప్పొంగి పడుతున్న జలపాతాలు, సాగర్‌ జలాశయం విస్తీర్ణం, పరిసర పచ్చని కొండలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీకెండ్, సెలవుదినాలు కావడంతో డ్యాం దగ్గర సందర్శకుల రద్దీ మరింతగా పెరిగింది. స్థానిక వ్యాపారులు, హోటల్‌ యజమానులు, బోటు నిర్వాహకులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నారు.