మహిళకు తడిసిన సీట్ ఇచ్చినందుకు ఇండిగోకు షాక్.. రూ.1.5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..

మహిళకు తడిసిన సీట్ ఇచ్చినందుకు ఇండిగోకు షాక్.. రూ.1.5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..

విమానం ప్రయాణించేటప్పుడు ఒకోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. కొందరు వీటిని పట్టించుకోకపోయినా మరికొందరు కోర్టు మెట్ల వరకు లాగుతారు. డబ్బులు పెట్టి టికెట్ కొని సర్వీస్ సరిగ్గా లేకుంటే ఎవరికైనా కోపం తెప్పిస్తుంది. అయితే ఒక మహిళకు శుభ్రంగా లేని తడిసిన సీటు ఇచ్చినందుకు  ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీస్ లోపం కింద రూ.1.5 లక్షల పరిహారం ఇవ్వాలని  ఢిల్లీ కన్స్యూమర్ కోర్ట్ ఆదేశించింది.

వివరాల ప్రకారం పింకీ అనే మహిళ జనవరి 2న  బాకు నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నప్పుడు శుభ్రంగా లేని తడిసిన మురికి సీటు  ఇచ్చినందుకు  ఆమెకి రూ.1.5 లక్షల పరిహారం ఇవ్వాలని  న్యూఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల లోపానికి పాల్పడిందని కమిషన్ జూలై 9వ తేదీ ఆర్డర్లో తెలిపింది. పింకీ పడ్డ ఇబ్బంది, మానసిక వేదన,  వేధింపులకు నష్ట పరిహారంగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటుగా వ్యాజ్యల ఖర్చుల కోసం రూ.25,000 కూడా కట్టాలని ఇండిగోను కమిషన్ ఆదేశించింది. అయితే, ఎయిర్‌లైన్స్ ఈ ఆరోపణలను ఖండించింది.  సమస్యను గుర్తించి వెంటనే  ఆమెకు వేరే సీటు ఇచ్చామని, ఆమె సంతోషంగానే   ప్రయాణించారని తెలిపింది.

అయితే, కోర్టుకి ఎయిర్‌లైన్స్ సిట్యుయేషన్ డేటా డిస్‌ప్లే (SDD) రిపోర్ట్ ఇవ్వడంలో ఫెలైందని, విమాన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ప్రయాణీకులకు సంబంధించిన ఘటనలను రికార్డ్  చేయడానికి SDD ముఖ్యం. ఈ డేటా  లేకపోవడం వల్ల  ఎయిర్‌లైన్స్ వాదన బలహీనపడిందని కమిషన్ పేర్కొంది.