
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివ స్మరణతో మార్మోగింది..శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదాశ రుద్రాభిషేకం నిర్వహించారు.
భక్తులు తెల్లవారుజామున కల్యాణ కట్టలో తలనీలాల సమర్పించి పవిత్రమైన ధర్మగుండంలో స్నానమచరించారు. అనంతరం క్యూలైన్లలో ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
అర్ధమండల శివదీక్షలు ప్రారంభం
వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం అర్ధమండల శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, గురుస్వాములు ఆధ్వర్యంలో సుమారు 300 మంది భక్తులు శివుడి మాల ధరించారు.
మొదట శివదీక్షలు ఈ నెల 17న 41 రోజులకు గానూ ధరించగా.. అర్ధమండల దీక్షలు 21 రోజులపాటు వేసుకోనున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఈశ్వరగారి సురేశ్, శివ గురుస్వాములు వాసాలమరి గోపి, తమ్మల భీమన్న, కిషన్, శ్రీకాంత్, శేఖర్, తదితరులు తదితరులు పాల్గొన్నారు.