- డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి
నిజామాబాద్ రూరల్, వెలుగు : రైతులకు అందిస్తున్న సహకార బ్యాంకు సేవలు అమోఘమని, నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధిలో దూసుకెళ్తుందని డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం బ్యాంకు ఆర్థిక లావాదేవీలు రూ.2,500 కోట్లు దాటిన నేపథ్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3వేల కోట్ల లావాదేవీలు అయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ‘కామధేను డిపాజిట్’ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో నాగభూషణం, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సహకార వారోత్సవాల ప్రారంభం..
నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 72వ సహకార వారోత్సవాలను చైర్మన్ రమేశ్‌రెడ్డి ప్రారంభించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయ ఆవరణలో సహకార పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, నాబార్డు డీడీఎం ప్రవీన్, సీఈవో నాగభూషణం తదితరులు
పాల్గొన్నారు.
దుర్కి గ్రామ సొసైటీలో..
నస్రుల్లాబాద్ : మండలంలోని దుర్కి గ్రామ సొసైటీలో శుక్రవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్ గంగారం, రాజు, రాములు, సెక్రటరీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
