ఫేక్ షేక్!! సోషల్ మీడియాలో జోరుగా డీప్ ఫేక్స్

ఫేక్ షేక్!! సోషల్ మీడియాలో జోరుగా డీప్ ఫేక్స్
  •   జీవోలు, టికెట్ల కేటాయింపు లేఖలు ఫ్యాబ్రికేటెడే?
  •  ప్రత్యర్థిపై బురద చల్లడమే లక్ష్యం
  •  సెకన్లలో ప్రత్యక్షమవుతున్న వీడియోలు
  •  క్షణాల్లో వైరల్ అవుతున్న మీమ్స్ 
  •  ఏది నిజమో తేల్చుకోలేక పోతున్న నెటిజన్లు
  •  బ్లైండ్ గా ఫిక్సయితే కష్టమేనంటున్న నిపుణులు

హైదరాబాద్: ఇదిగో పులి అంటే అదిగో తోక.. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. లోక్ సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ లో ఉంది. పార్టీలు ఈ పనుల కోసం ఏకంగా ప్రత్యేకంగా టీమ్స్ నే  నడుపుతున్నాయి. తమ నాయకుడి ప్రచారంతో పాటు ప్రత్యర్థి మీద బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇందుకోసం డీప్ ఫేక్ లను తయారు చేసి ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, ఇన్ స్టాలో, వాట్సాప్ గ్రూప్ లలో వదులుతున్నారు. అవి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిజాన్ని తలదన్నేలా ఉండటం, ఇందుకు జీవోలను, వీడియోలను, ఫొటోలను జత చేయడంతో అవే నిజమని నమ్మే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు.

 నాలుగు ఓట్లను డబ్బాలో వేయించుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ తతంగం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఎవరు క్రియేట్ చేశారు.. ఎవరు సర్క్యులేట్ చేశారు అనేది ఒక్కో సారి పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్య తీసుకోవడం లేదు. దీంతో డీప్ గ్యాంగ్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నాయి. ఎవరైనా లీడర్ మాట్లాడితే వీడియోను ఎడిట్ చేసి దానికి పాత క్లిప్స్ తగిలించి.. బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాటను క్రియేట్ చేసి మీమ్స్ గా వదులుతున్నారు. 

సినిమాల్లోని చెడ్డీ గ్యాంగులు, విలన్ల ముఖాలకు లీడర్ల ఫొటోలు తగిలించి డైలాగ్ లను సింక్ చేసి పైశాచికానందం పొందుతున్నారు. సరదాగా నవ్వుకోవడానికి ఉపయోగపడ్డ మీమ్స్ కాస్తా నాయకుల పరువు తీసే సాధనాలుగా మారుతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతకం చేసినట్టు ఉన్న ఓ ఫేక్ లెటర్ బయటికి వచ్చింది. అల్గిరి రెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కేటాయించినట్టు ఒకటి క్రియేట్ అయితే ఆ వెంటనే వెలిచాల రాజేందర్ కు టికెట్ ఇచ్చినట్టు మరో లెటర్ రెడీ అయిపోయింది. 

వీళ్లిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చారో తేల్చుకోలేని అయోమయం కార్యకర్తల్లో నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా అన్నట్టు ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో మార్ఫింగ్ అని పోలీసులు గుర్తించారు. వీటిని చూస్తున్న నెటిజెన్లు ఏది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారు. కరెంటు పోకున్నా పోయినట్టు.. వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ ను తయారు చేసి వదులుతుండటం గమనార్హం. 

ఈసీ వెబ్ సైట్ లో ఫ్యాక్ట్ చెక్

ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో మిత్ వర్సెస్ రియాల్టీ పేరుతో డీప్ ఫేక్ ను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ అధికారులు వైరలవుతున్న​ అబద్ధంతో పాటు వాస్తవ సమాచారాన్ని జోడిస్తున్నారు. ఈసీ గుర్తించి వాస్తవాన్ని వివరించే లోపు లక్షలాది మందికి అబద్దపు సమాచారం రీచ్ అవుతోంది. ఈ కారణంగా తమ ఓట్లకు గండి పడుతుందని రాజకీయ పార్టీలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఆందోళనలో పార్టీలు

తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని క్లాజ్–2 పారా–1 ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ఎప్పటికప్పుడు తప్పుడు వీడియోలు, అసత్య ప్రచారాలపై ఫిర్యాదులు చేస్తున్నా సోషల్ మీడియాలో అడ్డు, అదుపు లేకుండా ప్రచారం సాగుతూనే ఉంది. 

ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే..

ఒక వ్యక్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయడం, తప్పుదో పట్టించే కంటెట్ ను ప్రచారం చేయడం, మోసపూరిత, ఫ్యాబ్రికేటెడ్( సృష్టించిన) కంటెంట్ ను, తప్పుడు విషయాన్ని (మానిప్యులేటెడ్ కంటెంట్) సృష్టించి నిందలు చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు.   ఫేక్​ న్యూస్​ ప్రచారం చేసే వారు చట్ట ప్రకారం శిక్షార్హులు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్​, 2008లోని సెక్షన్ 66 డి, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​, 2005లోని సెక్షన్ 54, ఇండియన్​ పీనల్​ కోడ్​, 1860లోని 153, 499, 500, 505 (1) సెక్షన్ల ప్రకారం వారు శిక్షార్హులు. 

ఒక వ్యక్తి ఏదైనా పరికరం లేదా కంప్యూటర్ ద్వారా ఒక వ్యక్తిపై మోసపూరిత ఆరోపణలు చేస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ 66 డి కింద వారు శిక్షార్హులని చట్టం చెబుతోంది.  ఎవరైనా ఒక వ్యక్తిని వాడకూడని భాష ద్వారా లేదా సంకేతాల ద్వారా ఉద్దేశపూర్వకంగా దూషించినా, హాని తలపెట్టినా, వాటిని పదే పదే సోషల్​ మీడియాలో ప్రచారం చేసినా పరువు నష్టం కిందకు వస్తుంది. ఈ చర్యల ద్వారా వారి సంఘంలో స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాసినట్లే అవుతుంది. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద శిక్షార్హులవుతారు