ఈసీకి ఎస్ఐఆర్ ఇప్పుడే గుర్తొచ్చిందా ? బిహార్ ఎన్నికల ముందు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటి?

ఈసీకి ఎస్ఐఆర్ ఇప్పుడే గుర్తొచ్చిందా ? బిహార్ ఎన్నికల ముందు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటి?

బిహార్ శాసనసభ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఆలోచనా సరళిలో సంక్లిష్టత ఎలా చోటుచేసుకుంది? సహజసిద్ధంగా జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణను బిహార్ ఎన్నికల ముందు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటి? బీహార్ ఓటర్ల జాబితా సవరణలో స్పెషల్ ఇన్​టెన్సివ్ రివిజన్ (ఎస్​ఐఆర్) చేయాల్సిన ప్రత్యేక ఆలోచన వెనుక ఉన్న శక్తులు, తాత్విక భూమిక అనుమానాలకు దారితీసింది. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా సిటిజన్​షిప్  వెరిఫికేషన్ యాప్​ను ఉపయోగించడం అనేది అనేక అనుమానాలు, అభ్యంతరాలకు దారితీసింది. 

భవన నిర్మాణ రంగంలో పనిచేయడం కోసం బిహార్​ ప్రజలు దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు ఇతర రాష్ట్రాలకు పనుల నిమిత్తం తాత్కాలిక వలస వెళ్తారు. ఇండ్లవద్ద వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉంటారు. స్పెషల్ డ్రైవ్​లో అలాంటివారి ఓట్లు తొలగించడం అంటే దాదాపు శ్రామిక వర్గం ఓట్లు గంపగుత్తగా ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించడం అవుతుంది.  ఈ దేశంలో పుట్టిపెరిగినవారెవరూ సిటిజెన్​షిప్​ పత్రాలు దగ్గర పెట్టుకోరు. అవి ఏమిటో కూడా సామాన్య ప్రజలకు అర్థంకాని విషయం. తన స్వతంత్రతను కాపాడుకోవాల్సిన ఎన్నికల సంఘం చర్యలకు నిరసనగా స్థానిక ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణ నినాదంవరకు వెళ్లాయి. అత్యున్నత న్యాయస్థానం సైతం ఈవిషయంలో సిటిజెన్​షిప్ అవసరం లేదు,  ఆధార్ కార్డు ప్రాతిపదిక తీసుకొని వెరిఫికేషన్ చేయవచ్చని స్పష్టంగా ప్రకటించింది.

తరచూ సిటిజెన్​షిప్​ వివాదం!
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం సిటిజెన్​షిప్ వివాదాన్ని తరచూ వివిధ రంగాల్లో అమలుకు ప్రయత్నాలు చేస్తోంది. వివాదాస్పదం చేస్తోంది. స్వతంత్ర్య వ్యవస్థగా కొనసాగించాల్సిన ఎన్నికల సంఘం విధానాల్లోకి రాజకీయ పరమైన ఎత్తుగడలు ప్రవేశించడమే వ్యవస్థీకృత పతనానికి నాందిగా చెప్పుకోవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్​గా తనదైన ముద్రవేసిన టియన్ శేషన్ లాంటి  నిక్కచ్చిగా నిబంధనలు అమలుపరిచిన స్వతంత్ర్య ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళిన ఎన్నికల సంఘమేనా ఇది అని సంశయం కూడా ఒక్కోసారి మనకు కలుగుతుంది. నిరంతరం ఎన్నికల సరళీకరణ, ఎక్కువ మంది వయోజనులు ఓటు వేసే విధంగా ప్రచారం చేస్తూ వచ్చిన ఎన్నికల సంఘం విధానాలు రూపకల్పన పేరుతో ఎందరో వయోజనుల ఓట్లు తొలగించే సంక్లిష్టత వైపు హఠాత్గా మళ్ళడం అనేది దేనికి సంకేతం?

బీజేపీ తెచ్చిన అనర్థ సంస్కరణలు
2017లో ఎన్నికల నిధులు పారదర్శకత పేరుతో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ‘ఎలెక్టోరల్ బాండ్లు’ అనే సంస్కరణ సుప్రీంకోర్టు తప్పు పట్టేవరకు.. అందులో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వివిధ పార్టీలకు సమకూరిన నిధులు, వేలకోట్లు బాండ్లు కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థలు తీరు చూస్తే.. మీకిది, మాకిది అన్నరీతిగా వ్యవహారం మారింది. చట్టబద్ధమైన అవినీతి రూపమే ‘ఎలక్టోరల్​ బాండ్లు’ అనే విషయం బహిర్గతం అయ్యింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో సమతుల్యం తొలగించడమైంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినిఎంపిక కమిటీ నుంచి తొలగించి మరో మంత్రిని నామినేషన్​లో భాగస్వామ్యం చేయడం ద్వారా రాజకీయ ఆధిపత్యానికి ఎన్నికల కమిషనర్ నియామకంలో పెద్దపీట వేయడం జరిగింది. ఫలితంగా కమిషనర్ ఎంపిక స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారింది! ఎన్నికల సంఘం నిర్ణయాలు సైతం వివాదాస్పదం అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్వతంత్ర సంస్థలు తమ స్వతంత్రత అనే వాసన కోల్పోతున్నాయి.  ఇప్పటికైనా ఎన్నికల సంఘం సిల్వర్ జూబ్లీలోకి ప్రవేశించినందున రాజ్యాంగం ప్రసాదించిన తన స్వాతంత్ర్యతతోపాటు, ప్రత్యేకత నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం అనేది ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రతపైనే ఆధారపడి ఉంది.

ఎన్.తిర్మల్, సోషల్​ వర్కర్